Kingdom : ‘కింగ్డమ్’ మూవీ రివ్యూ.. అన్న కోసం తమ్ముడు మొత్తం తగలపెట్టేశాడా?
విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టి చాలా కాలం అయింది.

Kingdom Review
Kingdom Movie Review : విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా ‘కింగ్డమ్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. నేడు జూలై 31న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. 1920లో బ్రిటిష్ వాళ్ళు శ్రీకాకుళం దగ్గర ఉన్న ఓ తెగ మీద బంగారు గనుల కోసం దాడి చేసి ఆ తెగ రాజుతో సహా అందర్నీ చంపేస్తారు. కొంతమంది ఆ తెగ పిల్లల్ని మాత్రం అక్కడి నుంచి తప్పించి ఒక ఓడలో సముద్రంలో వదిలేస్తారు. వాళ్ళు శ్రీలంకకు వచ్చి శరణార్థులుగా బతుకుతూ, వాళ్ళ రాజు వస్తాడని, వాళ్ళని కాపాడతాడని ఆశతో ఒక దీవిలో బతుకుతూ ఉంటారు. వాళ్లకి ఇండియా, శ్రీలంక రెండు దేశాలు గుర్తింపు ఇవ్వకపోవడంతో అక్కడ ఉన్న కొంతమంది గ్యాంగ్ స్టర్స్ వీళ్ళని రౌడీలుగా, స్మగ్లర్లుగా వాడుకుంటుంటారు.
1990లో సూరి(విజయ్ దేవరకొండ) కానిస్టేబుల్ గా పనిచేస్తూ చిన్నప్పుడు తన తండ్రిని చంపి వెళ్లిపోయిన అన్న శివ(సత్యదేవ్)ని వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ పోలీస్ తో గొడవ పడతాడు. దీంతో పై ఆఫీసర్స్ సూరిని గుర్తించి మీ అన్న శ్రీలంకలో ఒక తెగకు నాయకుడిగా, క్రిమినల్ గా ఉన్నాడు. అతన్ని తెచ్చుకో అలాగే మాకు ఒక ఆపరేషన్ చేసి పెట్టు అని సూరిని శ్రీలంకకు పంపిస్తారు. శ్రీలంకలో శివ, అతని తెగ వాళ్ళను పడియప్పన్, అతని కొడుకు మురుగన్(వెంకటేష్) కంట్రోల్ చేస్తూ ఉంటారు. సూరికి అక్కడ ఉన్న ఇంకో స్పై మధు(భాగ్యశ్రీ భోర్సే) హెల్ప్ చేస్తుంది అని చెప్తారు.
మరి సూరి వాళ్ళ అన్న శివని కలిసి ఏం చేసాడు? అతనికి ఇచ్చిన ఆపరేషన్ ఏంటి? అక్కడి తెగలో శివ ఎలా కలిసిపోయాడు? శ్రీలంకలో సూరి ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? శివ చిన్నప్పుడు తండ్రిని ఎందుకు చంపాడు? ఆ తెగ వాళ్ళందరూ వెతుకుతున్న వాళ్ళ రాజు ఎవరు? మధు సూరికి ఎలా సపోర్ట్ చేసింది? సూరి స్పై అని అక్కడ ఎవరికైనా తెలుస్తుందా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Kingdom twitter review : ‘కింగ్‌డమ్’ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడిందా..
సినిమా విశ్లేషణ.. విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టి చాలా కాలం అయింది. కింగ్డమ్ టీజర్, ట్రైలర్స్ తో పాటు సినిమాలో విజయ్ కొత్త లుక్ తో ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు నెలకొల్పారు. ఒక తెగ కథతో పాటు, ఓ అన్న ఎమోషన్ రెండూ కలిపి బాగానే రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా సూరి తన అన్న కోసం వెతకడం, అన్న దగ్గరకు వెళ్లడం, అక్కడ తెగలో కలిసిపోవడంతో సాగుతుంది. సెకండ్ హాఫ్ లో తెగని కంట్రోల్ చేసే అక్కడి గ్యాంగ్ స్టర్స్ తో విబేధాలు, స్పై ఆపరేషన్, అన్న తమ్ముడు ఎమోషన్ తో సాగుతుంది.
అన్న -తమ్ముడు ఎమోషన్ మాత్రం బాగా రాసుకున్నారు. అక్కడక్కడా బోర్ కొట్టినా అనిరుధ్ తన మ్యూజిక్ తో నిలబెట్టాడు. ఈ కథకు సపరేట్ గా తెగ, దాని చుట్టూ కథ అవసరం లేకపోయినా రాసుకున్నారు. సినిమా చూస్తుంటే రెట్రో, కంగువ.. లాంటి సినిమాలు గుర్తొస్తాయి. పార్ట్ 2 కి చివర్లో లీడ్ ఇచ్చారు కానీ సెకండ్ హాఫ్ లో సాగదీయకుండా కథ పూర్తి చేయాల్సింది. స్పై ఆపరేషన్ ఇంకా ఏదో ఉంది అన్నట్టు లీడ్స్ ఇచ్చారు కానీ అవేవి క్లారిటీగా చెప్పలేదు. హీరోయిన్ తో ఉన్న సీన్స్ చాలా వరకు ఎడిటింగ్ లో తీసేసినట్టు ఉన్నారు. విజయ్ – భాగ్యశ్రీ మధ్య రిలీజ్ చేసిన సాంగ్ సినిమాలో లేదు. గౌతమ్ ఏదో పెద్దగా రాసుకుందాం అనుకున్నారు కానీ కథ ఇంకా క్లారిటీగా రాసుకోవాల్సింది. ప్రీ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ ఊహించరు. క్లైమాక్స్ లో చాలా సందేహాలతో, కొన్ని ట్విస్టులతో పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు. అక్కడక్కడా కొన్ని యాక్షన్ సీన్స్, విజయ్ కి ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
నటీనటుల పర్ఫార్మెన్స్.. విజయ్ దేవరకొండ ఓ కొత్త లుక్ లో కనిపిస్తూ తన పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు ఎమోషనల్ సీన్స్ లోను బాగా నటించాడు. గత సినిమాలకు కొంత భిన్నంగా కనిపించే ప్రయత్నం చేశాడు. సత్యదేవ్ మాత్రం విజయ్ అన్న పాత్రలో అదరగొట్టాడు. సత్యదేవ్ కి మంచి యాక్షన్, ఎమోషనల్ సీన్స్ పడ్డాయి. భాగ్యశ్రీ భోర్సే సింపుల్ లుక్స్ లో సీరియస్ పాత్రలో అక్కడక్కడా కనిపించి మెప్పించింది. నెగిటివ్ పాత్రలో మలయాళం నటుడు వెంకటేష్ కూడా మెప్పిస్తాడు. ఓ భైరాగిగా అయ్యప్ప శర్మ బాగానే నటించారు. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో మెప్పిస్తారు.
సాంకేతిక అంశాలు.. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్, మ్యూజిక్ ప్రాణం పోశాయి. ప్రతి ఫ్రేమ్ లోను విజువల్స్ చాలా బాగా చూపించారు. అనిరుధ్ సినిమాకు తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రాణం పోసాడు. సినిమా స్లో అవుతుంది, బోర్ కొడుతుంది అన్నప్పుడల్లా తన మ్యూజిక్ తో హైప్ ఇచ్చాడు. సాంగ్స్ కూడా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ లు కొత్తగా డిజైన్ చేశారు.
శ్రీలంక, వైజాగ్.. రియల్ లొకేషన్స్ లో షూట్ చేసి చాలా సహజంగా చూపించారు. అన్న కోసం వెతుక్కుంటూ వెళ్లే తమ్ముడు రొటీన్ కథ అయినా దానికి స్పై ఆపరేషన్, ఓ తెగ కథ ఇవన్నీ కలిపి కొత్తగా రాసుకున్నారు. కథనం ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ ఇంకా ట్రిమ్ చేస్తే బాగుండేది. నిర్మాణ పరంగా మాత్రం ఈ సినిమా బాగా ఖర్చుపెట్టినట్టు తెరపై ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తుంది.
మొత్తంగా ‘కింగ్డమ్’ సినిమా చిన్నప్పుడు వెళ్లిపోయిన అన్నను వెతుక్కుంటూ వెళ్లిన తమ్ముడు ఓ తెగలో ఎలా కలిసిపోయాడు, ఆ తెగ కోసం ఏం చేసాడు అని విజువల్ ట్రీట్ తో మెప్పించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.