టాలీవుడ్‌ వైజాగ్‌కు షిఫ్ట్‌ అవుతుందా? ఎందుకు? రీజనేంటి?

దేవర సినిమా టికెట్ల వ్యవహారంలో కూడా టాలీవుడ్‌కు ఏపీ సర్కార్‌ నుంచి మద్దతు బాగానే దొరికింది.

టాలీవుడ్‌ వైజాగ్‌కు షిఫ్ట్‌ అవుతుందా? ఎందుకు? రీజనేంటి?

Updated On : October 3, 2024 / 9:41 PM IST

అవునా.. నిజమేనా..? టాలీవుడ్‌ వైజాగ్‌కు షిఫ్ట్‌ అవుతుందా..? ఎందుకు..? రీజనేంటి..? వైజాగ్‌ తెలుగు సినీ పరిశ్రమకు బాగుంటుందా..? ఏపీలో కూటమి ప్రభుత్వం సహకరిస్తామని.. త్వరగా వచ్చేయ్‌మని పిలుస్తోందటగా.. ఇంకేంటి షిఫ్ట్‌ అయిపోతే పోలా.. ఫిల్మ్‌ నగర్‌లో ఇలాంటి గాసిప్సే చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఇవి ఊహాగానాలకే పరిమితమా..? నిజంగా అలాంటి ప్రయత్నాలు బలంగా జరుగుతున్నాయా..?

ఈమధ్య కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది టాలీవుడ్‌. రేవ్‌ పార్టీలు, డ్రగ్స్‌, నటీనటుల మధ్య పర్సనల్‌ ఇష్యూస్‌. ఇలా ఏదో ఒక రూపంలో వార్తల్లోకెక్కుతూ టాలీవుడ్‌ గిలగిలా కొట్టుకుంటోంది. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌తో టాలీవుడ్‌ అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది.

ఒక కుటుంబానికి సంబంధించిన అంశమే అయినా.. టాలీవుడ్‌లోనే పెద్ద కుటుంబం కావడం.. పైగా నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత.. ఇలా అందరూ సినీ గ్లామర్‌ బాగా ఉన్న నటులుగా వెలుగొందిన వారు కావడంతో.. ఇది ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్‌ చేసింది. మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌.. ఇలా ఒకరేమిటి.. ఆల్మోస్ట్‌ టాలీవుడ్‌లో ప్రముఖులంతా రియాక్ట్‌ అయ్యారు.

ఇదే సమయంలో టాలీవుడ్‌లో కొన్ని ఊహాగానాలకు రెక్కలొచ్చాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. పైగా డిప్యూటీ సీఎంగా పవన్‌ కల్యాణ్‌ ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. దీంతో టాలీవుడ్‌ వైజాగ్‌కు షిఫ్ట్‌ అయిపోతుందన్న కామెంట్స్‌ జోరుగా వినిపిస్తున్నాయి. తమకు స్థలాలు కేటాయిస్తే వైజాగ్‌లో స్టూడియోలు కట్టుకుంటామంటూ ఏపీ ప్రభుత్వ పెద్దలతో టాలీవుడ్‌ పెద్దలు మాటామంతీ బలంగా చేస్తున్నట్లు తెలుస్తోంది.

గత ప్రభుత్వంతో టాలీవుడ్‌ గ్యాప్‌
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు .. ఆతర్వాత పరిస్థితుల్లో గతంలోనే టాలీవుడ్‌ వైజాగ్‌కు షిష్ట్‌ అవుతుందన్న వార్తలు వినిపించాయి. కానీ గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భరోసా ఇచ్చింది. ఆ తర్వాత కూడా ఏపీకి వెళ్దామన్న ఆలోచనలు మొలకలెత్తాయి. టికెట్ల రేట్లు, ఇతర గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో గత ప్రభుత్వంతో టాలీవుడ్‌ గ్యాప్‌ మెయింటైయిన్‌ చేస్తూ వచ్చింది. దీంతో ఆ తర్వాత అలాంటి ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి. కానీ.. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం పవర్‌లో ఉంది. దీంతో తమకు సహకరిస్తే.. షిఫ్ట్‌ అయ్యేందుకు సిద్ధమన్న ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో జోరందుకుంది.

ప్రస్తుతం కొందరు సినిమా స్టూడియోలు లీజుకు తీసుకుని నడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి. దీంతో వీలైనంత త్వరగా ఏపీ ప్రభుత్వం ఇచ్చే భరోసాను బట్టి వైజాగ్‌కు ఇండస్ట్రీని షిఫ్ట్‌ చేసే ఆలోచనలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. దసరా తర్వాత ఏపీ ప్రభుత్వ పెద్దల్ని ఇండస్ట్రీ ప్రముఖులు వెళ్లి కలిసే ఆలోచనలో కూడా ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది. కుదిరితే దేవర సక్సెస్‌ ఈవెంట్‌ను గన్నవరంలో చెయ్యడానికి కూడా ఆ సినిమా బృందం ప్లాన్‌ చేస్తోందనేది ఫిల్మ్‌ నగర్‌లో చక్కర్లు కొడుతున్న ఒక వార్త.

దేవర సినిమా టికెట్ల వ్యవహారంలో కూడా టాలీవుడ్‌కు ఏపీ సర్కార్‌ నుంచి మద్దతు బాగానే దొరికింది. డిప్యూటీ సీఎంగా ఉన్నది కూడా టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా చేసిన పవన్‌ కల్యానే. ఆయనకు ఇండస్ట్రీ సాధకబాధకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా సినిమా రంగంలో ఏయే క్రాఫ్ట్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనేది క్లియర్‌ కట్‌గా తెలుసు. మెగాస్టార్‌ చిరంజీవి లాంటి వ్యక్తులు పూనుకుంటే.. అనుకున్న పని కార్యరూపం దాల్చుతుందన్న ఆశలూ ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి. ఇంతకీ ఈ విషయాన్ని ఎవరు లీడ్‌ తీసుకుంటారు..? ఏపీ ప్రభుత్వ పెద్దలతో మంతనాలు ముందుకెళ్తాయా..? లేక గతంలోలాగే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోతారా..? చూడాలి.

Bigg Boss 8 : వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వ‌చ్చే 8 మంది వీరేనా? లిస్ట్‌లో గంగ‌వ్వ‌?