రాష్ట్రాల అనుమతి అక్కర్లేదు : అగ్రకులాల రిజర్వేషన్ల బిల్లు

  • Published By: veegamteam ,Published On : January 8, 2019 / 03:23 PM IST
రాష్ట్రాల అనుమతి అక్కర్లేదు : అగ్రకులాల రిజర్వేషన్ల బిల్లు

Updated On : January 8, 2019 / 3:23 PM IST

అగ్రకులాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్రాల అనుమతి అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఆర్ధికంగా వెనుకబడిన పేదలకు రిజర్వేషన్ల ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్టికల్ 15, 16ను అర్ధం చేసుకోవడంలో కొంత గందరగోళం ఉందని చెప్పారు. ఆర్టికల్ 15 విద్యలో రిజర్వేషన్ల గురించి.. ఆర్టికల్ 16 ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్ల గురించిన వివరణ ఉన్నట్లు చెప్పిన జైట్లీ.. రాజ్యాంగంలో సోషలిజం అనే పదం లేదని గుర్తు చేశారు. 50శాతం పరిమితి అనేది కేవలం కుల రిజర్వేషన్లకే అని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. వెనుకబాటుతనానికి కులమే అత్యుత్తమ ప్రాతిపదిక అని జైట్లీ చెప్పారు. EBC రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో అరుణ్ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు.

అలాగే 50శాతం రిజర్వేషన్ పరిమితి అన్నది ఆర్టికల్ 16 (4) ప్రకారం నిర్ణయించారని జైట్లీ చెప్పారు. అందుకే తాము ఆర్టికల్ 15, 16 లకు సవరణ చేసి ఆర్థిక పరమైన రిజర్వేషన్లకు న్యాయపరమైన అడ్డంకులు లేకుండా చూస్తామన్నారు. ప్రతి పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిందని, కానీ అవన్నీ చట్టం వెనుక దాక్కున్నాయని జైట్లీ అన్నారు. ఈ అంశంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో ఆర్థికంగా అణగారిన వర్గాలు వెనుకబడుతున్నారని, వాళ్లను పైకి తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమని జైట్లీ చెప్పారు.