100 రోజుల మోడీ 2.0 : కీలక,సంచలన నిర్ణయాలు

మోడీ 2.0 సర్కార్ నేటితో 100రోజులు పూర్తి చేసుకుంది. నరేంద్రమోడీ అధ్వర్యంలో… రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. 2014తో పోల్చితే… 2019లో మోడీ 2.0 చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే కాదు… అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు మరింత గుర్తింపు వచ్చేలా చేసిందని చెప్పుకోవచ్చు. సంస్కరణల విషయంలోనూ మోడీ సర్కార్ ఏమాత్రం వెనకడుగు వెయ్యకుండా… దూసుకెళ్లింది. ప్రధానంగా… లోక్ సభ ఎన్నికల్లో భారీ విజయం దక్కించుకోవడంతో… కేంద్రంలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఓ రేంజ్‌లో పెరిగాయి.
ప్రధానంగా మోడీ… ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చే దిశగా ఈ 100 రోజుల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విషయంలో ఆయన ఏమాత్రం వెనకడుకు వెయ్యకపోవడం విశేషం. కశ్మీర్ కు ప్రత్యేకయ హోదా కల్పించే ఆర్టికల్ 370రద్దు,ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై భారీగా ఫైన్ లు విధించేలా మోటర్ వెహికల్ చట్టానికి సవరణ చేయడం, త్రిపుల్ తలాక్ చట్టం అమల్లోకి తీసుకురావడం,ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం, అవినీతిపై ఉక్కుపాదం,పోస్కో చట్టానికి సవరణ,ఫిట్ ఇండియా ఉద్యమానికి పిలుపునివ్వడం, ఆర్టీఐకి సవరణ,ఎమ్ సీఐ సవరణ బిల్లు అమల్లోకి ఇలా వంద రోజుల పాలనలో మోడీ 2.0 అనేక కీలక,సంచలన, వివాదాస్పద నిర్ణయాలను తీసుకుంది. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటికీ ఈ విషయంలో పాకిస్తాన్ కుట్రలు సాగనివ్వకుండా… అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కి మద్దతు కూడగట్టటంలో కేంద్రం విజయం సాధించింది.
అయితే ప్రస్తుతం ఆర్థిక మాంద్యం కేంద్ర ప్రభుత్వానికి సవాళ్లు విసురుతోంది. బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాలేవీ మాంద్యం కోరల నుంచీ దేశాన్ని కాపాడలేకపోతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్న ఉద్దీపన నిర్ణయాలు కూడా కలిసిరావట్లేదనే వాదన వినిపిస్తోంది. మోడీ తొలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి దాపురించిందని విపక్షాలు, ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా దేశ ఆర్థికవ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ చేతకానితనం,అనాలోచితంగా జీఎస్టీ అమలు,నోట్ల రద్దు వంటి నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఆటోమెబైల్ ఇండస్ట్రీ కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రముఖ వాహన తయారీదారు సంస్థ మారుతీ సుజుకీ కూడా ఆర్థికమాంద్యం కారణంగా సేల్స్ పడిపోయి రెండు రోజులు గురుగ్రామ్,మానేసర్ లోని తమ ఫ్లాంట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే 2025 నాటికి రూ.5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న మోడీ సర్కార్ ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని ఎంతవరకూ గట్టెక్కిస్తుందో భవిష్యత్తులో తెలుస్తుంది.
మోడీ 2.0…100రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ్టి నుంచీ కొన్ని రోజులపాటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే మహారాష్ట్రలో మళ్లీ అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు ఉండబోతున్నట్లు తెలిసింది. ఆ రాష్ట్రానికి కొన్ని కీలక ప్రాజెక్టుల్ని ప్రకటిస్తారని సమాచారం. వాటన్నింటినీ… ఎన్నికలకు ముందే… ప్రధాని మోడీ స్వయంగా ప్రారంభించేలా ప్లాన్స్ ఉండబోతున్నాయి.
ప్రస్తుతం మోడీ ప్రభుత్వంపై ప్రజల్లో చాలా మంది సంతృప్తికరంగా ఉన్నట్లు ABP న్యూస్ సర్వేలో తేలింది. ఈ సర్వే ప్రకారం… 41 శాతం మంది మోడీ పాలన అద్భుతంగా ఉందని తెలపగా, 27 శాతం మంది బాగానే ఉందని అభిప్రాయపడ్డారు. ఆగస్ట్ చివరి వారంలో అన్ని రాష్ట్రాల్లో ఈ సర్వే చేపట్టినట్లు ABP తెలిపింది.