హోటల్ పూరీలో బల్లి : 12 మందికి అస్వస్థత

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. పూరీలో చనిపోయిన బల్లి కనిపించింది. ఆ పూరీలు తిన్న 14 మందిలో 12మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కావడంతో వాంతులు చేసుకున్నారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాస్ గంజ్ రైల్వేస్టేషన్ లో ఈ ఘటన జరిగింది. ఆదివారం(సెప్టెంబర్ 8, 2019) రాత్రి ఫిలిబిత్ కు చెందిన ఓ కుటుంబం మథురలో రాధారాణి ఆలయాన్ని దర్శించుకుంది. తర్వాత స్వస్థలానికి తిరుగుపయనమైంది. దారిలో కాస్ గంజ్ దగ్గర రైలు కాస్త ఎక్కువసేపు ఆగింది. దీంతో రైల్వేస్టేషన్ బయటికి వెళ్లి తమకిష్టమైన చోలె-పూరి తీసుకున్నారు. కుటుంబసభ్యులు అంతా తిన్నారు. కాసేపట్లో తినడం పూర్తవుతుందనగా వారిలో ఒకరి ప్లేట్ లో చనిపోయిన బల్లి కనిపించింది. దీంతో వారు షాక్ అయ్యారు. ఆ వెంటనే 12 మంది వాంతులు చేసుకున్నారు. వారందర్నీ అధికారులు కాస్ గంజ్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో నలుగురు చిన్న పిల్లలు, ముగ్గురు వృద్ధులు ఉన్నారు.
కాస్ గంజ్ జిల్లా అదనపు మేజిస్ట్రేట్ దీనిపై స్పందించారు. ”ఫుడ్ పాయిజన్ కారణంగా 12మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను జిల్లా ఆసుపత్రిలో చేర్పించాము. చికిత్స అందించిన తర్వాత సోమవారం ఉదయం వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశాము. వారు తిన్న డిన్నర్ లో చనిపోయిన బల్లి ఉందని చెప్పారు. చనిపోయిన బల్లి చిత్రాన్ని వారు చూపించారు. కానీ భౌతికంగా ఆధారం ఇవ్వలేకపోయారు. బాధితులు ఆహారం కొన్న షాప్ నుంచి కొంత ఆహారం సేకరించాము. వాటి సాంపుల్స్ ని ల్యాబ్ కి పంపాము. దానిపై పరీక్షలు చేస్తున్నారు. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాము. తప్పు ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాము” అని జిల్లా అదనపు మేజిస్ట్రేట్ యోగేంద్ర కుమార్ చెప్పారు.