CAA,NRCకి మద్దతుగా…రాష్ట్రపతికి 154మంది ప్రముఖుల లేఖ

పౌరసత్వ సవరణ చట్టం (CAA),ప్రతిపాదిత జాతీయ పౌరపట్టిక (NRC)కి వ్యతిరేకంగా ఓ వైపు దేశంలోని పలుప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో సీఏఏ,ఎన్‌ఆర్‌సీలకు మద్దతుగా 154 మందికి పైగా ప్రముఖులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సోమవారం(ఫిబ్రవరి-17,2020) లేఖ రాశారు. దేశానికి హాని చేసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాన్ని సాగిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో వారు రాష్ట్రపతిని కోరారు.
రాష్ట్రపతికి లేఖ రాసిన ప్రముఖుల్లో వివిధ కోర్టులకు చెందిన 11 మంది మాజీ న్యాయమూర్తులు, 24 మంది విశ్రాంత ఐఏఎస్ అధికారులు, 11 మంది మాజీ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారులు, 16 మంది విశ్రాంత ఐపీఎస్‌లు, 18 మంది మాజీ లెఫ్టినెంట్ జనరల్స్ ఉన్నారు.
సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసలను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని, దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిరక్షించాలని ఆ లేఖలో వారు రాష్ట్రపతిని కోరారు. భారత ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే ఇలాంటి నిరసనల వల్ల దేశ ఐక్యత, సమగ్రతకు భంగం వాటిలో ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి నిరసనల వెనుక ఉన్న శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
దేశానికి హానికలిగించే కుతంత్రాలు, ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ఉద్దేశాలు ఈ చర్యల వెనుక ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. ఇందువల్ల హింస తలెత్తి, ప్రభుత్వ, ప్రజా ఆస్తులు ధ్వంసమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నిరసనల వల్ల భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతాయని, ఇది దేశానికి మంచిది కాదన్నారు.