Land Auction: బాప్ రే.. 2 ఎకరాలు రూ.2వేల కోట్లు..! ఇండియాలోనే రికార్డ్..
అభివృద్ధికి సిద్ధంగా ఉన్న భూముల కోసం అధిక ధరలు చెల్లించడానికి పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. ఈ స్థలం కోసం జరిగిన బిడ్డింగ్‌లో ప్రముఖ డెవలపర్లు పాల్గొన్నారు.
Land Auction: భూముల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో భూమి ధరలు పలుకుతున్నాయి. అక్కడ ఇక్కడ అని కాదు.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. తాజాగా 2 ఎకరాల భూమి 2వేల కోట్లు పలకడం హాట్ టాపిక్ గా మారింది. రైల్వే ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఆర్‌ఎల్‌డిఏ) దక్షిణ ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో ఉన్న 2.5 ఎకరాల స్థలం రికార్డు స్థాయిలో రూ. 2,250 కోట్ల బిడ్ పలికింది. దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఇదే అత్యధికం. బిడ్డింగ్‌లో దేశంలోని అగ్రశ్రేణి డెవలపర్లు పాల్గొన్నారు. ఇది ప్రధాన పట్టణ భూములపై పెట్టుబడిదారుల్లో ఉన్న బలమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ స్థలం కోసం జరిగిన బిడ్డింగ్‌లో నలుగురు ప్రముఖ డెవలపర్లు పాల్గొన్నారు.
బిడ్డర్లలో దినేష్‌చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్‌ఫ్రాకాన్ అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది. రూ. 2,250 కోట్ల బిడ్‌ను సమర్పించింది. శోభా రియల్టీ రూ. 1,232 కోట్లకు బిడ్ దాఖలు చేయగా, లోధా గ్రూప్ రూ. 1,161 కోట్లకు బిడ్ వేసింది.
ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్ ఈ పరిణామంపై స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబైలో ముఖ్యంగా మహాలక్ష్మి వంటి మంచి రవాణ సౌకర్యాలున్న ప్రాంతాలలో ప్రధాన భూములకు పెరుగుతున్న డిమాండ్‌కు ఇది బలమైన సూచికగా అభివర్ణించారు. ”రెసిడెన్షియల్, కమర్షియల్ డెవలపర్ల నుండి ఈ ప్రాంతానికి అధిక డిమాండ్ ఉంది. ఈ వేలానికి వచ్చిన స్పందన ముంబైలోని వ్యూహాత్మక భూభాగాలకు ఉన్న ఆకర్షణను నొక్కి చెబుతోంది. సెంట్రల్ లొకేషన్ లో ఉన్న, అభివృద్ధికి సిద్ధంగా ఉన్న భూముల కోసం పెట్టుబడిదారులు అధిక ధరలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. దీర్ఘకాలంలో అధిక రిటర్న్స్ ఆశిస్తున్నారు” అని ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్ తెలిపారు.
దక్షిణ ముంబైలోని అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతాలలో మహాలక్ష్మి సైట్ ఒకటి. సిటీ హైఎండ్ రెసిడెన్షియల్, కమర్షియల్ సెగ్మెంట్ కూడా. ప్రధాన రవాణా కేంద్రాలకు, బిజినెస్ డిస్ట్రిక్ట్స్ కు, లైఫ్ స్టైల్ సౌకర్యాలకు సమీపంలో ఉంటుంది. అందుకే, ఈ భూమి అంత రేటు పలుకుతోంది. గతంలో అనేక ల్యాండ్ ఆంక్షన్స్ జరగ్గా.. వాటన్నింటిని ఈ రికార్డ్ బిడ్ బ్రేక్ చేసింది. విలాసవంతమైన గృహాలు, వాణిజ్య సముదాయాలు, పునరాభివృద్ధి ప్రాజెక్టులకు ఉన్న డిమాండ్ కారణంగా నగరంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పుంజుకున్నాయి.
Also Read: ఎల్ఐసీ అద్భుతమైన స్కీమ్.. ఈ బీమా కవచ్ ప్లాన్‌తో.. 100ఏళ్ల వరకు ఫుల్ ప్రొటెక్షన్.. ఎవరు అర్హులంటే?
