దేశంలో మార్చి నుంచి మూడో దశ కోవిడ్ వ్యాక్సినేషన్

దేశంలో మార్చి నుంచి మూడో దశ కోవిడ్ వ్యాక్సినేషన్

Updated On : February 5, 2021 / 9:25 PM IST

3rd phase దేశంలో మూడో దశ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ మార్చి నుంచి ప్రారంభమవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ఇవాళ పార్లమెంట్ కు తెలిపారు. శుక్రవారం క్వచన్ అవర్ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ లు మరియు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సభ్యులు లెవనెత్తిన ప్రశ్నలకు హర్షవర్థన్ కు సమాధానమిస్తూ.. మొదటి,రెండో దశలు ముగిసిన తర్వాత మూడో దశ వ్యాక్సినేషన్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే ఖచ్చితమైన తేదీని చెప్పలేమని..అయితే మార్చి రెండు,మూడు లేదా నాలగో వారంలో ప్రారంభమవ్వచ్చని తాము అంచనావేస్తున్నామని తెలిపారు.

మూడో దశలో మొత్తం 27కోట్ల మందికి( 50ఏళ్లు పైబడిన మరియు వైరస్ ప్రమాదం కలిగిన వయస్సు వారికి) మూడో దశలో వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలిపారు. 50ఏళ్లు పైబడినవారిపై మూడో దశలో ఫోకస్ ఉంటుందని తెలిపారు. వ్యాక్సినేషన్ కొరకు ఆర్థికమంత్రిత్వశాఖ బడ్జెట్ లో 35,000కోట్ల రూపాలను కేటాయించినట్లు హర్షవర్థన్ తెలిపారు. అవసరమైతే నిధులను ఇంకా పెంచుతామని హామీ కూడా ఇచ్చిన విషయాన్ని ఆరోగ్య మంత్రి గుర్తు చేశారు.

దేశంలో ప్రస్తుతానికి రెండు వ్యాక్సిన్లను(కోవాగ్జిన్,కోవిషీల్డ్) మాత్రమే అత్యవసర వినియోగానికి అనుమతిచ్చినట్లు తెలిపారు. మరో ఏడు వ్యాక్సిన్లు డెవలప్ దశలో ఉన్నాయన్నారు. ఈ ఏడు వ్యాక్సిన్లలో.. మూడు చివరిదశ క్లినికల్ ట్రయిల్ స్టేజీలో, రెండు వ్యాక్సిన్లు ఫేజ్-1మరియు ఫేజ్-2 క్లినికల్ ట్రయిల్ స్టేజీల్లో ఉన్నాయన్నారు. మిగిలిన రెండు వ్యాక్సిన్లు..అడ్వాన్స్ ప్రీ క్లినికల్ స్టేజీలో ఉన్నట్లు హర్షవర్థన్ తెలిపారు. ఇక, వ్యాక్సిన్లు కావాలని 22 దేశాల నుంచి భారత్ కు అభ్యర్థనలు వచ్చాయని..ఇప్పటికే 15 దేశాలకు వ్యాక్సిన్ ను సరఫరా చేసినట్లు తెలిపారు. 56 లక్షల డోసులను గ్రాంట్ కింద 5లక్షల డోసులను కాంట్రాక్ట్ కింద సరఫరా చేసినట్లు తెలిపారు.

కాగా,దేశంలో జనవరి-16న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. కరోనా కాలంలో ప్రాణాలను రిస్క్ లో పెట్టి తమ విధులను నిర్వహించిన హెల్త్ కేర్ సిబ్బంది,ఫ్రంట్ లైన్ వర్కర్లకు ముందుగా వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 3కోట్ల మంది హెల్త్ కేర్ సిబ్బంది,ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించినట్లు సమాచారం.