Avalanche in Badrinadh : బద్రీనాథ్ లో హిమపాతం బీభత్సం.. చిక్కుకుపోయిన 47 మంది కార్మికులు

భారీ హిమపాతం కారణంగా రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు.

Avalanche in Badrinadh : బద్రీనాథ్ లో  హిమపాతం బీభత్సం.. చిక్కుకుపోయిన 47 మంది కార్మికులు

Pic: @suryacommand

Updated On : February 28, 2025 / 4:48 PM IST

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో హిమపాతం బీభత్సం సృష్టించింది. సైనికుల కోసం వేస్తున్న రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా అక్కడి మంచును కార్మికులు తొలగిస్తున్న సమయంలో హిమపాతం వారిని ముంచేసింది.

బద్రీనాథ్‌కు దగ్గరలోని మనా గ్రామంలోని బీఆర్వో శిబిరానికి సమీపంలో ఈ విషాదకర ఘటన జరిగింది. ఆ సమయంలో 57 మంది కార్మికులు మంచు చరియల కిందనే చిక్కుకుపోగా, వారిలో 10 మందిని సహాయక బృందాలు రక్షించాయి.

మిగతా వారిని రక్షించడానికి రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇప్పటికీ మంచు దట్టంగా కురుస్తుండడంతో రెస్క్యూ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. పోలీసులతో పాటు బీఆర్వో సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Viral Video: పెళ్లి వేడుకలోకి దూసుకువచ్చిన కోతులు.. వాటి చేష్టలకు నవ్వుల్.. నవ్వుల్‌..

ఉత్తరాఖండ్‌ విపత్తు సహాయ దళ అధిపతి సూచనల మేరకు జోషిమత్‌లోని సమీప పోస్ట్ నుంచి రెస్క్యూ టీమ్‌ను అక్కడకు పంపారు. అదనంగా డెహ్రాడూన్‌లోని గౌచర్, సహస్త్రధారలోని హై ఆల్టిట్యూడ్ రెస్క్యూ టీమ్‌లను సిద్ధంగా ఉంచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హిమపాతంపై స్పందించారు.

“చమోలి జిల్లాలోని మానా గ్రామం సమీపంలో బీఆర్వో చేపడుతున్న నిర్మాణ పనుల సమయంలో చాలా మంది కార్మికులు హిమపాతం కింద చిక్కుకున్నట్లు తెలిసింది. ఐటీబీపీ, బీఆర్వో, ఇతర రెస్క్యూ టీమ్‌లు రెస్క్యూ ఆపరేషన్‌లను నిర్వహిస్తున్నాయి. కార్మిక సోదరుల భద్రత కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.

ఇప్పటివరకు హిమపాతంపై రెస్క్యూ ఆపరేషన్‌పై ఎటువంటి ప్రకటన జారీ చేయనప్పటికీ గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో భారీ హిమపాతం నమోదవుతున్నందున సహాయక చర్యలు కొనసాగించడానికి కష్టంగా ఉందని తెలుస్తోంది.

బీఆర్వో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీఆర్ మీనా మాట్లాడుతూ.. మూడు నుంచి నాలుగు అంబులెన్స్‌లను సంఘటన స్థలానికి తరలించినట్లు చెప్పారు. అయితే, భారీ హిమపాతం కారణంగా రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు.