56అంగుళాల బాక్సర్ కోచ్ అడ్వాణీ ముఖంపైనే పంచ్ విసిరాడు

నరేంద్రమోడీ సర్కార్ తీసుకున్న పాలసీపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ.ఎకానమీ నుంచి అగ్రికల్చర్ వరకు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై రాహుల్ ఫైర్ అయ్యారు.ప్రధాని మోడీని బాక్సర్ తోనూ, ఎల్‌కే అడ్వాణీని కోచ్ తోనూ రాహుల్ పోల్చారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా….2008 బీజింగ్ ఒలింపిక్స్ కి నలుగురు బాక్సర్లను పంపిన హర్యానాలోని భీవానీలో సోమవారం(మే-6,2019)నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ…గత లోక్ సభ ఎన్నికల్లో 56 అంగుళాల ఛాతీ ఉన్న నరేంద్రమోడీ అనే ఓ బాక్సర్ నిరుద్యోగం, రైతుల కష్టాలు, అవినీతి సహా ఇతర సమస్యలతో పోరాడతానంటూ బాక్సింగ్ రింగ్ లోకి దిగాడు. దేశప్రజలందరూ అక్కడ గుమిగూడారు.
నరేంద్ర మోడీ కోచ్ అడ్వాణీతో పాటు గడ్కరీలాంటి టీం సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. దేశ ప్రజలందరూ ఈ బాక్సర్ పేదరికం,అవినీతిపై పోరాడుతాడని,రైతుల సమస్యలు పరిష్కరిస్తాడని,ఒక్కొక్కరి అకౌంట్లలో 15లక్షల రూపాయలు వేస్తాడని చెప్పారు.అయితే తీరా రింగ్‌లోకి దిగిన బాక్సర్ మోడీ.. కోచ్ వైపు చూసి అడ్వాణీ గారి ముఖంపై పంచ్ విసిరి తన టీమ్ మెనుక పరిగెత్తాడు.గడ్కరీ,అరుణ్ జైట్లీ వంటి వాళ్లపై కూడా ఈ బాక్సర్ పంచ్ లు విసిరాడు. తర్వాత ఇదే బాక్సర్ నోట్లరద్దు, ‘గబ్బర్ సింగ్ ట్యాక్స్ తో చిరువ్యాపారుల పొట్టకొట్టాడని రాహుల్ అన్నారు. బాక్సర్ పనులు చూసి అందరూ నిశ్చేష్టులయ్యారంటూ రాహుల్ చమత్కరించారు. రాహుల్ మాట్లాడుతున్న సమయంలో అక్కడున్నవాళ్లందరూ నవ్వు ఆపుకోలేకపోయారు.