ఎన్నో ప్రత్యేకతలు…అహ్మదాబాద్-ముంబై తేజస్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం

  • Published By: venkaiahnaidu ,Published On : January 17, 2020 / 08:00 AM IST
ఎన్నో ప్రత్యేకతలు…అహ్మదాబాద్-ముంబై తేజస్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం

Updated On : January 17, 2020 / 8:00 AM IST

అహ్మదాబాద్-ముంబైల మధ్య తేజస్ ఎక్స్ ప్రెస్ రైలును ఇవాళ(జనవరి-17,2020)కేంద్రమంత్రి పియూష్ గోయల్ అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని, రాష్ట్ర మంత్రులు, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైలు అహ్మదాబాద్‌ నుంచి ఉదయం 6:40 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 13:10 గంటలకు ముంబై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. తిరిగి ముంబై సెంట్రల్‌ నుంచి మధ్యాహ్నాం 3:40 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 9:55 గంటలకు అహ్మదాబాద్‌ చేరుకుంటుంది.

నదియాడ్‌, వడోదర, భారుచ్‌, సూరత్‌, వాపీ, బొరివలి స్టేషన్‌లలో రైలు ఆగుతుంది. ముంబై నుండి అహ్మదాబాద్ వరకు, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ క్లాస్ టికెట్ ధర రూ .2,374 (రూ. 1,875 బేస్ ఛార్జీలు, జీఎస్టీ రూ. 94, క్యాటరింగ్ ఛార్జ్ రూ .405 తో సహా), ఏసీ చైర్ కార్ క్లాస్ టికెట్ ధర రూ .1,274 (బేస్ సహా) 870 రూపాయల ఛార్జీలు, 44 రూపాయల జీఎస్టీ, క్యాటరింగ్ ఛార్జీ 360 రూపాయలు). గరిష్ఠంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సెమీ హైస్పీడ్ రైలు తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నడిచే టైం టేబుల్‌ను ప్రకటించామని, జనవరి 19వ తేదీ నుంచి రెగ్యులర్‌గా వారానికి 6 రోజలు రైలు నడుస్తుందని గోయల్ తెలిపారు. రైలులో ప్రయాణించాలనుకునే వారు 60 రోజుల ముందు నుంచి రిజర్వేషన్‌ చేసుకోవచ్చని వెల్లడించారు.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్‌ ముబైల్‌ యాప్‌లో టికెట్‌ రిజర్వేషన్‌ తీసుకోవచ్చు. తత్కాల్‌ కోటా, ప్రీమియం తత్కాల్‌ కోటా ఇందులో లేవు. జనరల్‌ కోటా, విదేశీ టూరిస్ట్‌ కోటా మాత్రమే ఉన్నాయి. పూర్తి ఏసీతో కూడిన ఈ రైలు 736 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రయాణికులందరికీ ఐఆర్‌సీటీసీ ద్వారా రూ.25 లక్షల ఉచిత భీమా కల్పిస్తున్నారు. రైలు ఆలస్యం అయితే గంట ఆలస్యానికి రూ.100, రెండు గంటల ఆలస్యానికి రూ.250లను ఐఆర్‌సీటీసీ పరిహారంగా చెల్లిస్తుంది. 

తేజస్ రైలు ఇప్పటి వరకు భారతీయ రైల్వేలో వచ్చిన అన్ని ట్రెయిన్‌ల కన్నా విలాసవంతమైంది. ఇందులో ఆటోమేటిక్ డోర్స్, ఎల్‌సీడీ తెరలు, వైఫై, టీ, కాఫీ మెషిన్లు, మ్యాగజైన్స్, బయో టాయిలెట్స్, హ్యాండ్ డ్రయర్స్ వంటి ఆధునిక సదుపాయాలు ఎన్నో ఉన్నాయి.  తేజస్ రైలు కోచ్‌లను కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. ఈ కోచ్‌లు పూర్తిగా గ్రాఫిటీ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ టెక్నాలజీలతో తయారు చేయబడ్డాయి. అంటే ఈ రైలు పెట్టెలపై ఎవరు దేంతో రాసినా గీతలు పడవు. అదేవిధంగా దుమ్ము, ధూళి కూడా పెద్దగా అంటుకోదు. తేజ‌స్ రైలులో సీట్ల‌ను అత్యంత అధునాత‌న డిజైన్‌తో త‌యారు చేశారు. వాటిలో కూర్చుంటే రైలు ఎంత వేగంతో వెళ్తున్నా కుదుపులు ఉండ‌వు.

ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఉన్న 20 కోచ్‌లు ఈ ట్రెయిన్‌లో ఉన్నాయి. చెయిర్ కార్ ఉన్న కోచ్‌లు 12 ఉన్నాయి. మొత్తం 32 బోగీలను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ఒక్కో బోగీకి 56 మంది ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. అదే చెయిర్ కార్‌లో అయితే 78 మంది వరకు ప్రయాణించవచ్చు. ఈ రైలులో ఇందులో అగ్ని ప్రమాదాలను పసిగట్టే స్మోక్ డిటెక్షన్, ఫైర్ డిటెక్షన్ టెక్నాలజీలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపేందుకు అవకాశం ఉంటుంది.

అదేవిధంగా ఈ రైలులో ప్రయాణికుల సీట్ల వెనుక ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ తెరలపై జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేను ప్రదర్శించనున్నారు. దీంతో రైలు ఎక్కడుందో ప్రయాణికులకు సులభంగా తెలుస్తుంది. దివ్యాంగుల కోసం బ్రెయిలీ లిపిలో కూడా ఇందులో సమాచారాన్ని ఏర్పాటు చేశారు.