గుండెపోటుతో అన్నా డీఎంకే ఎమ్మెల్యే కన్నుమూత

చెన్నై: అన్నా డీఎంకే ఎమ్మెల్యే ఆర్. కనగరాజ్ గురువారం ఉదయం గుండెపోటుతో మరణించారు. తమిళనాడులోని , కోయంబత్తూరు జిల్లా సులూరు నియోజక వర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గురువారం ఉదయం న్యూస్ పేపరు చదువుతూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. సీఎం పళని స్వామితో సహా పలువురు మంత్రులు నివాళులర్పిచేందుకు కోయంబత్తూరు వెళ్ళనున్నారు.
ఎమ్మెల్యే కనగరాజ్ మృతితో తమిళనాడు అసెంబ్లీ లో మొత్తం 22 స్ధానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఏఐఏడీఎంకే సంఖ్యాబలం 113 కి తగ్గింది. ఇది మెజార్టీకి 5 స్ధానాలు తక్కువ. కాగా తమిళనాడులోని 39 లోక్ సభ స్ధానాలతో పాటు, ఎమ్మెల్యేల మరణాల వలన ఖాళీ అయిన స్ధానాలకు, అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల నియోజక వర్గాలతో కలుపుకుని 18 స్ధానాల్లో ఏప్రిల్ 18 న ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 3 స్ధానాలకు ఎన్నికలు నిర్వహించవద్దని డీఎంకే కోర్టుకు వెళ్ళింది. కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున కేంద్ర ఎన్నికల సంఘం ఆ స్ధానాలకు ఎన్నికలు నిర్వహించటంలేదు.
తమిళనాడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో దాదాపు 10 శాతం స్ధానాలు ఖాళీగా ఉండటం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రధమం. 2016 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇప్పటి వరకు ఐదుగురు ఎమ్మెల్యేలు మరణించారు. కాగా…వీరిలో నలుగురు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్నారు.