గంగమ్మ చెంతకే తరలివచ్చిన భారీ హనుమంతుడు : ప్రయాగ్‌రాజ్‌లో గంగాభిషేకం

రాజస్థాన్‌లోని భీల్వాడా జిల్లా నుంచి సంగమ్‌లో స్నానం చేయించేందుకు ఊరేగింపుగా తరలివచ్చిన 64 టన్నుల హనుమాన్ విగ్రహం 18 రోజుల తరువాత ప్రయాగ్‌రాజ్ చేరుకుంది. సాక్షాత్తు గంగమ్మ చెంతనే హనుమంతుడు తరలివచ్చారు. గంగాజలంతో అభిషేకింపబడ్డాడు. ఈ అపురూపమైన..అద్భుతమైన ఘట్టాన్ని భారీగా తరలివచ్చిన భక్తులు కనులారీ వీక్షించారు.
రెండు సంవత్సరాల క్రితం దౌసా జిల్లాలోని సికంద్ర వద్ద 28 అడగుల పొడవు కలిగిన ఈ హనుమాన్ విగ్రహం బాంద్ ప్రాంతంలోని హనుమాన్ మందిరం సమీపంలో ఉంచిన ఈ విగ్రహానికి గంగాజలంతో వేదమంత్రోచ్ఛారణల నడుమ అభిషేకాదులు నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని వీక్షించటానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి పూజాదికార్యక్రమాలు నిర్వహించారు. అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు స్వామీ నరేంద్ర గిరి ఆధ్వర్యంలో ఈ ఘట్టం కన్నుల పండువగా జరిగింది. హనుమంతుని విగ్రహం 64 టన్నుల బరువు ఉండటంతో, దానిని సంగమ్ ఘాట్ వద్దకు తీసుకువెళ్లలేకపోయారు. బాంద్‌లోని హనుమంతుని విగ్రహం పక్కనే ఈ భారీ హనుమంతుని విగ్రహాన్ని ఉంచి అభిషేకాదులు నిర్వహించారు.
దౌసా జిల్లాలోని భిల్వారా బైపాస్ సమీపంలో ఉన్న హతిభాటా ఆశ్రమంలో హనుమంతుడి విగ్రహాన్ని నిర్మించిన తరువాత నెల రోజులపాటు భక్తుల సందర్శనార్ధం ఉంచారు. తరువాత నాలుగు భారీ క్రేన్లతో 40 చక్రాలు..60 అడుగుల పొడవైన ట్రాలీలో ఉంచారు. అలా ప్రయాగ్ రాజ్ లోని సంగమ్ వద్ద హనుమంతుడికి స్నానం చేయించటానికి వందల కిలోమీటర్ల దూరం పాటు అత్యంత సమన్వయంతో తరలించారు.