Telangana Election Results 2025: తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. తుది విడతలోనూ కాంగ్రెస్ మద్దతుదారుల హవా..
సర్పంచ్ పదవి కోసం 12వేల 652 మంది.. వార్డు మెంబర్లుగా 75వేల 725 మంది పోటీలో నిలిచారు.
Telangana Election Results 2025: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల హవా కొనసాగుతోంది. మొదటి, రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ మద్దతుదారులు మూడో విడతలోనూ జోరు కొనసాగించారు. అత్యధిక స్థానాలను గెలుచుకున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. 6వేల సర్పంచ్ స్థానాల్లో జెండా ఎగురవేశారు. ఇక బీఆర్ఎస్ మద్దతుదారులు 3వేల స్థానాల వరకు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ మద్దతుదారులు కూడా కొంత పట్టు నిలుపుకునే ప్రయత్నం చేశారు. 600 స్థానాల్లో కాషాయ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలిచారు. ఇక ఇండిపెండెంట్లు పార్టీలతో సంబంధం లేకుండా పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీలకన్నా అభ్యర్థులే ముఖ్యం అని 1500 మంది నిరూపించారు. దాదాపు 1500 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. సర్పంచ్ స్థానాలు, వార్డు మెంబర్ల లెక్క మొత్తం రేపు ఉదయానికి క్లారిటీ రానుంది.
తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. తుది విడత పోలింగ్ ముగిసింది. దీంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు చివరి విడత పోలింగ్ కు గ్రామీణ ఓటర్లు పోటెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంట వరకు 80.78 పోలింగ్ నమోదైంది.
ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటగా వార్డు స్థానాల ఫలితాలను ప్రకటిస్తారు. సాయంత్రం వరకు కౌంటింగ్ కొనసాగనుంది. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. ఇవాళ రాత్రిలోగా ఈసీ అన్ని ఫలితాలను ప్రకటించనుంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
మూడో విడతలో భాగంగా మొత్తం 182 మండలాల్లోని 3వేల 752 సర్పంచ్ స్థానాలకు (గ్రామ పంచాయతీలకు), 28వేల 410 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ విడతలో 4వేల 157 గ్రామాలకు.. 36వేల 434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 394 గ్రామాలు, 7వేల 916 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 3వేల 752 గ్రామ పంచాయతీల్లో 12వేల 640 మంది సర్పంచ్ అభ్యర్థులు.. 28వేల 406 వార్డులకు ర్75వేల 283 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 11 గ్రామాలకు, 112 వార్డులకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. 2 గ్రామ పంచాయతీలు, 18 వార్డులపై కోర్టు స్టే విధించింది.
Also Read: పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ స్పీకర్ సంచలన నిర్ణయం.. అనర్హత పిటిషన్ల కొట్టివేత

