కుండపోత వర్షాలు.. అమర్‌నాథ్‌ యాత్రకు బ్రేక్‌.. మళ్లీ పున:ప్రారంభం ఎప్పుడంటే?

భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

కుండపోత వర్షాలు.. అమర్‌నాథ్‌ యాత్రకు బ్రేక్‌.. మళ్లీ పున:ప్రారంభం ఎప్పుడంటే?

Amarnath Yatra

Updated On : July 17, 2025 / 9:21 AM IST

Amarnath Yatra: హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే ఆధ్యాత్మిక కేంద్రాల్లో అమర్‌నాథ్ ఒకటి. ఈనెల 2వ తేదీ నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. యాత్ర ప్రారంభమైన నాటినుంచి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. తాజాగా.. జమ్మూకశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మరోసారి యాత్ర వాయిదా పడింది.

జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కుండపోత వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల కారణంగా యాత్ర మార్గాల్లో జారడంతోపాటు.. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గురువారం ఒక్కరోజు అమర్‌నాథ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరిగి 18వ తేదీ (శుక్రవారం) నుంచి యాత్ర పున: ప్రారంభం అవుతుందని తెలిపారు. అయితే, వర్షాల తీవ్రత తగ్గకుంటే మరో రెండుమూడు రోజులు యాత్రను నిలిపివేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

భారీ వర్షాల కారణంగా పహల్గామ్, బాల్తాల్ మార్గాల్లో ఉన్న ట్రాక్ లను పునరుద్దరించేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ తన సిబ్బంది, యంత్రాలను భారీగా మోహరించింది. శుక్రవారం రెండు బేస్ క్యాంపులను యాత్ర ప్రారంభమయ్యే సమయానికి ట్రాక్ లను బాగు చేయాలని అధికారులు సూచించారు. కుండపోత వర్షాల కారణంగా బాల్తాల్ మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో ఓ మహిళా భక్తురాలు చనిపోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు.

యాత్ర ఎప్పుడు పూర్తవుతుంది.
అమర్‌నాథ్ యాత్ర ఈనెల 2వ తేదీన ప్రారంభమైంది. ఇప్పటి వరకు 2.35లక్షలకుపైగా యాత్రికులు పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. మరో నాలుగు లక్షల మందికిపైగా యాత్ర కోసం ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మొత్తం 38 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర ఆగస్టు 9వ తేదీతో ముగియనుంది.