బాబ్రీ కేసు విచారణ…అద్వానీని కలిసిన అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా…బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీతో సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని అద్వానీ నివాసానికి బీజేపీ నేత భూపేందర్ యాదవ్‌తో కలిసి వెళ్లిన ఆయన 30 నిమిషాలపాటు చర్చలు జరిపారు.
ఆగస్ట్ 5న అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి సంబంధించి ఇద్దరు నేతలూ మాట్లాడుకున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆయన్ను కోరినట్లు తెలిసింది. మరోవైపు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈ నెల 24న సీబీఐ కోర్టు ఎదుట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అద్వానీ హాజరుకానున్న తరుణంలో షా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాగా, ఆగస్టు 5న ప్రధాని మోడీ చేతుల మీదుగా అయోధ్యలో రామమందిరానికి భూమి పూజ కార్యక్రమం జరగనుంది. అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, కరోనా నేపథ్యంలో ఎక్కువ మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకూడదని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయించింది.
కేవలం 150 మంది అతిథులు సహా 200 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొంటారని,అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కార్యక్రమానికి ఆహ్వానించినట్లు ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్‌గిరి తెలిపారు. అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.