దేవెగౌడ చనిపోతారు…కర్ణాటకలో దుమారం రేపిన మరో ఆడియో టేప్

  • Published By: venkaiahnaidu ,Published On : February 13, 2019 / 01:29 PM IST
దేవెగౌడ చనిపోతారు…కర్ణాటకలో దుమారం రేపిన మరో ఆడియో టేప్

కన్నడ పాలిటిక్స్ లో ఆడియో టేప్ ల కలకలం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆపరేషన్ కమల్ పేరుతో ఇప్పటికే సీఎం కుమారస్వామి విడుదల చేసిన ఆడియో టేప్స్ ఆ రాష్ట్ర శాసనసభను కుదిపేస్తున్న సమయంలో ఇప్పుడు మరో ఆడియో టేప్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికార జేడీయూ, ఓ బీజేపీ ఎమ్మెల్యే మధ్య జరిగిన సంబాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో మరింత హీట్ పుట్టిస్తోంది. ఆ ఆడియో క్లిప్ లో జేడీయూ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, సీఎం కుమారస్వామిపై  బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేవెగౌడ త్వరలో చనిపోతారు..కుమారస్వామికి ఆరోగ్యం బాగోలేదు కావున జేడీయూ చరిత్రలో మిగిలిపోనుంది అంటూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆడియో టేప్ లోని గొంతు బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడదిగా ఆరోపణలు రావడంతో ప్రీతమ్ గౌడ ఇంటిపై జేడీయూ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిపై లాఠీ ఛార్జి చేసి చెదరగొట్టారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న కర్ణాటక శాసనసభలో ఈ ఉదంతం వాగ్వాదానికి దారి తీసింది. జేడీయూ కార్యకర్తలపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, దాడికి దిగిన వారి అంతు చూస్తానని ప్రతిపక్ష నేత యడ్యూరప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే టేపులో మాట్లాడుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేతోపాటుగా  యడ్యూరప్ప కూడా ఉన్నారని సీఎం కుమారస్వామి ఆరోపించారు.