కరోనా విజృంభణ ఆగకపోతే ప్రపంచానికి మరో ముప్ప

  • Published By: Mahesh ,Published On : April 29, 2020 / 10:34 AM IST
కరోనా విజృంభణ ఆగకపోతే ప్రపంచానికి మరో ముప్ప

Updated On : April 29, 2020 / 10:34 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. 30 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనా సోకి 2 లక్షల మందికి పైగా మృతి మరణించారు. అయితే కరోనా వైరస్ విజృంభణ ఆగకపోతే ప్రపంచానికి మరో ముప్పు పొంచి ఉంది. ఆకలి చావులు సంభవించనున్నాయి. 

కరోనా వ్యాప్తి ఆగకుండా కొనసాగితే మరో 3 నెలలో ఆకలి చావులు తప్పవని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రతినిధులు హెచ్చరించారు. కరోనా వల్ల ప్రపంచ దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో ఎంతో మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని తెలిపారు. ఇలాంటి సందర్భంలో ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యసమితికి ఇచ్చే నిధుల్లో కోత విధించడం సరికాదన్నారు. మరోవైపు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ద్వారా 10 కోట్ల మందికి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో మూడు కోట్ల మంది తాము ఇచ్చే ఆహారంపై ఆధారపడ్డారని తెలిపారు. సమయానికి ఆహారం అందించకుంటే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. 

లాక్ డౌన్ నేపథ్యంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో వలస కూలీలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్న డబ్బు..తిండి..మొత్తం అయిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వీరిని ఆదుకుంటామని ప్రభుత్వాలు చెబుతున్నా..అనుకున్న మేర సత్ఫలితాలు ఇవ్వడం లేదు. బస్సులు, రైళ్లు నిలిచిపోవడంతో వందల కిలోమీటర్ల మేర కాలినడక  నడిచి వెళ్తున్నారు. స్వంతూళ్లకు బయలుదేరిన కొంతమంది మార్గం మధ్యలోనే మరణించారు. 

పేదల జీవితాలు దుర్బరంగా తయారయ్యాయి. ఆకలితో అలమటిస్తున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని వారి పరిస్థితి దయనీయంగా తయారైంది. రోజూ కూలీ చేసుకునే జనం అల్లాడిపోతున్నారు. ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని రంగాలు మూతపడ్డాయి. ఆదాయ మార్గాలు లేక దేశాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు మూత పడ్డాయి. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. నిత్యవసరాలు దొరకని పరిస్థితి నెలకొంది. తిండి లేక చిన్నారులు కప్పలను తినే దుస్థితి దాపురించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.