ఏప్రిల్ 14 : తదుపరి కార్యాచరణపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్

ఏప్రిల్ పద్నాలుగో తేదీతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన లాక్‌డౌన్ గడువు పూర్తయిపోతుంది. మళ్లీ మంచి రోజులొస్తాయా అని ఎదురు చూస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఇళ్లలో మగ్గిపోతున్న జనం కూడా .. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా అంటూ ఎదురుచూస్తున్నారు. కానీ ఎక్కడా.. కరోనా పాజిటివ్ కేసులు తగ్గకపోగా.. అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో తదుపరి కార్యాచరణపై కేంద్రప్రభుత్వం ఫోకస్ చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ.. లాక్‌డౌన్ తర్వాత ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై చర్చించారు.
సామాజిక దూరంతో పాటు లాక్‌డౌన్ ఉపశమన చర్యలు ఏకకాలంలో సాగాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు ప్రధాని మోదీ. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత తలెత్తే పరిస్థితులు, ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహాలు గుర్తించాలని… 10 కీలక నిర్ణయాలు, పది ప్రాధాన్యతా రంగాల జాబితాను సిద్ధం చేయాలని మంత్రులకు ప్రధాని సూచించారు. కరోనా హాట్‌స్పాట్స్‌ను మినహాయించి దశల వారీగా ఆంక్షలు సడలించేలా ప్రణాళిక ఉండాలన్నారు. హాట్‌స్పాట్స్ మినహా మిగతా ప్రాంతాల్లో ఒక్కో శాఖ నెమ్మదిగా పనులు ఆరంభించేలా ప్రణాళికను రూపొందించాలన్నారు. దీంతో ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్‌ను పాక్షికంగా ఎత్తేసి… ఆంక్షలు అమలు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
లాక్‌డౌన్ పొడిగిస్తే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దేశాన్ని చుట్టుముడుతుందని నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదే జరిగితే ప్రజల ఆరోగ్యం కాపాడినా.. దేశ ఆర్థిక ఆరోగ్యం దెబ్బతింటుంది. రెండింటిని కాపాడాలంటే.. తప్పనిసరిగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. లాక్‌డౌన్ ఒకేసారి ఎత్తివేస్తే.. జనం ఒక్కసారిగా ఒళ్లు విరుచుకుని రోడ్లపైకి వచ్చేస్తారు. దాంతో ఇన్ని రోజులు లాక్‌డౌన్ వచ్చిన ఫలితం కొట్టుకుపోతుంది. ఈ విషయం తెలిసిన ప్రధానమంత్రి పాక్షిక లాక్ డౌన్ ఎత్తివేత సూచనలు ప్రజల్లోకి పంపుతున్నారు. పాక్షిక లాక్ డౌన్ అంటే అనేక రకాల ఆంక్షలతో లాక్‌డౌన్ సడలింపు ఇచ్చే అవకాశముంటుంది. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.