NDA: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానంతో దక్షిణాది రాష్ట్రాలు దగాపడుతున్నాయా?
ఎక్కువ పన్నులు చెల్లిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు.. కేంద్ర వాటాగా అందుకోవాల్సిన మొత్తాన్ని నష్టపోవడానికి ప్రధానంగా..

NDA
One Nation One Tax: ఒకే దేశం.. ఒకే పన్ను విధానం.. కేంద్రం అమలు చేస్తున్న ఈ విధానంతో దక్షిణాది రాష్ట్రాలు దగాపడుతున్నాయా? కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలపై వివక్ష చూపుతోందా? ఉత్తరాది రాష్ట్రాలకన్నా.. దక్షిణాది రాష్ట్రాలకు అందుతున్న కేంద్ర పన్నుల ఆదాయం తక్కువగా ఉండటానికి కారణమేంటి?
ఉత్తరాది రాష్ట్రాలను పోషించేందుకు దక్షిణాదిరాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారా? కేంద్రం విధానాల వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఆందోళన చెందుతున్న కేరళ, కర్ణాటక రాష్ట్రాల బాటలోనే రేవంత్ సర్కార్ పయనించబోతోందా? కేంద్రం నుంచి తెలంగాణకు వస్తున్న ఆదాయం ఎంత? నష్టపోతున్నది ఎంత?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయం పంపిణీలో వివాదం ముదురుతున్నట్లు కనిపిస్తోంది. కేంద్రం విధానాల వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని కర్ణాటక సర్కారు ఢిల్లీలో ఆందోళన చేయగా, కేరళ కూడా అదేబాటలో పయనించడం, తమిళనాడు సర్కారు మద్దతు ప్రకటించడం సరికొత్త చర్చకు దారితీసింది.
కేంద్ర పన్నుల వాటా పంపిణీలో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుండటంతో.. ఆర్థికంగా నష్టపోతున్నామని దక్షిణాది రాష్ట్రాలు వాదనకు బలం చేకూరుతోంది. దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ లబ్ధి కోసమే కేంద్రంపై విమర్శలు చేస్తున్నాయని బీజీపీ విమర్శలు గుప్పిస్తున్నా, పన్ను ఆదాయం, వాటాల పంపిణీ లెక్కలు చూస్తే దక్షిణాదికి నష్టం జరుగుతోందని విషయాన్ని స్పష్టం చేస్తోంది.
సగ భాగాన్ని కేంద్రం తీసుకుని..
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 2017లో దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉండాలని వస్తు సేవల పన్ను – GSTని అమలులోకి తీసుకువచ్చింది. అప్పటివరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న రకరకాల పన్నులు అన్నింటిని రద్దుచేసి వన్ నేషన్… వన్ టాక్స్ కింద GSTని ప్రవేశపెట్టింది.
జీఎస్టీ ద్వారా రాష్ట్రాలు వసూలు చేసిన పన్నుల్లో సగ భాగాన్ని కేంద్రం తీసుకుని, ఆ మొత్తాన్ని అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయడమే ఈ పన్ను విధానంలోని ప్రధానాంశం. అయితే ఈ పంపిణీకి కేంద్రం అనుసరిస్తున్న విధానం దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ పన్ను ఆదాయానికి, కేంద్రం తిరిగి చెల్లిస్తున్న మొత్తానికి భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఇదేకారణంతో కర్ణాటక, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి నిరసన తెలియజేస్తున్నాయి.
ప్రస్తుతం వివిధ రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం 12 లక్షల 19 వేల 783 కోట్ల రూపాయలు వసూలు చేస్తోంది. ఈ మొత్తంలో సింహభాగం దక్షిణాది రాష్ట్రాల నుంచి సమకూరిందే… కేంద్రం వసూలు చేసిన మొత్తం పన్నుల్లో తెలంగాణ నుంచి పొందుతున్న ఆదాయం పది శాతం… కానీ, కేంద్రం తెలంగాణ వాటాగా తిరిగి చెల్లిస్తున్న మొత్తం కేవలం 2 శాతమే ఉంటుంది. అంటే తెలంగాణ నుంచి లక్షా 21 వేల కోట్ల రూపాయలు ఆదాయంగా పొందుతున్న కేంద్రం… ఆ ఆదాయంలో తెలంగాణ వాటాగా తిరిగి చెల్లిస్తున్న మొత్తం కేవలం 25 వేల 683 కోట్లు మాత్రమే.. ఇలా తెలంగాణ ఒక్క రాష్ట్రమే కాదు… దక్షిణాదిలో మిగిలిన నాలుగు రాష్ట్రాలకు అతితక్కువగానే కేంద్రం వాటా దక్కుతోంది.
ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య ఎంతో వ్యత్యాసం
కేంద్రం వాటా చెల్లింపుల్లో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని చెప్పడానికి ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు అందుతున్న మొత్తమే ఉదాహరణగా చూపుతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. పన్నుల ద్వారా కేంద్రానికి వస్తున్న ఆదాయంలో సింహభాగం ఉత్తరప్రదేశ్ కైవసం చేసుకుంటోంది. ఆ రాష్ట్రానికి ఏటా రెండు లక్షల 18 వేల 816 కోట్లు రూపాయలు చెల్లిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇదేవిధంగా మరో ఉత్తరాది రాష్ట్రం బిహార్‌కు లక్షా 22 వేల 685 కోట్లు అందిస్తోంది.
కేంద్ర ఆదాయం పొందడంలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఈ రెండు రాష్ట్రాలు, పన్ను చెల్లింపుల్లో మాత్రం దక్షిణాది రాష్ట్రాల కంటే వెనకే ఉంటున్నాయి. ఇంకా చెప్పాలంటే ఐదు దక్షిణాది రాష్ట్రాలకు కేటాయిస్తున్న మొత్తం కలిపినా ఉత్తరప్రదేశ్ పొందుతున్న ఆదాయానికి తక్కువగా ఉంటోంది.
కేంద్రానికి అధిక ఆదాయం చెల్లిస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణతోపాటు మిగిలిన అన్ని రాష్ట్రాలకు అన్యాయమే జరుగుతోందని వాదిస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. ఏపీకి 49 వేల 364 కోట్లు, కర్నాటకకు 44 వేల 485 కోట్లు, కేరళకు 23 వేల 480 కోట్లు, తమిళనాడుకు 49 వేల 754 కోట్లు కేంద్రం పన్నుల కింద చెల్లిస్తుంది. ఈ మొత్తం అంతా కలిపినా… ఇంకా 15 శాతం అధికంగా ఉత్తరప్రదేశ్ ఆదాయం పొందుతోంది. ఈ తేడానే తప్పుబడుతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు.
కేంద్రం అమలు చేస్తున్న విధానాలే కారణం
ఎక్కువ పన్నులు చెల్లిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు.. కేంద్ర వాటాగా అందుకోవాల్సిన మొత్తాన్ని నష్టపోవడానికి ప్రధానంగా కేంద్రం అమలు చేస్తున్న విధానాలే కారణమని వాదిస్తున్నాయి దక్షిణాది రాష్టాలు. పన్నుల వాటా పంపిణీలో కేంద్రం ఆరు అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటోంది. రాష్ట జనాభాకు 15 శాతం, విస్తీర్ణానికి 15 శాతం, పర్యావరణ సమతుల్యతకు 15 శాతం, వెనుకబాటుతనానికి 45 శాతం, పన్నుల ఆర్థిక నిర్వహణకు 2.5 శాతం, అభివృద్ధికి 12.5 శాతం కింద విభజించి చెల్లిస్తోంది.
ఈ విధానం వల్ల అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ ఎక్కువ లబ్ధి పొందుతోంది. కేంద్రం సూచనల మేరకు జనాభా నియంత్రణను పక్కాగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలు మాత్రం జనాభా తక్కువగా ఉందన్న కారణంతోనే నష్టపోతున్నాయి. మెరుగైన సమాజం కోసం ఆర్థిక క్రమశిక్షణ, జనాభా నియంత్రణ వంటి విధానాలు పాటించడమే దక్షిణాది రాష్ట్రాల శాపమా అంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నిస్తున్నాయి. ఆదాయం పంపిణీలో కేంద్రం విధానాలను మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వానికి ఇదే సవాల్
పన్నుల వాటాల పంపిణీలో రాష్ట్రాల అభివృద్ధి, ఆదాయం, ఆర్థిక క్రమశిక్షణ, ప్రభుత్వ విధానాలు, జనాభా నియంత్రణ లాంటి వాటిని కూడా ప్రాతిపాదికగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి రాష్ట్రాలు. ఇదే అంశంపై ఢిల్లీలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేయగా, అదేదారిలో కేరళ ప్రభుత్వం పయనిస్తోంది. ఇక ఏడు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ ప్రభుత్వానికి ఇదే సవాల్‌గా మారుతోంది. కేంద్రం నుంచి ఎంత ఎక్కువ సాయం పొందితే రాష్ట్రం ప్రభుత్వంపై ఆ మేరకు ఒత్తిడి తగ్గనుంది.
కానీ, కేంద్రం ప్రస్తుత విధానాల వల్ల ఎక్కువ ఆదాయం వచ్చినా, తిరిగి పొందలేని దుస్థితిని ఎదుర్కొంటోంది తెలంగాణ సర్కారు. ఈ పరిస్థితుల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కర్ణాటక మాదిరిగా ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచుతుందా? లేక మరో మార్గంలో ఆదాయం పెంచుకునే పని చేస్తుందా? అన్నది చూడాల్సివుంది.
మొత్తానికి జీఎస్టీ ప్రవేశపెట్టిన ఆరేళ్లకు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతున్నట్లు బయటపడింది. కారణమేదైనా ఇప్పటికైనా ఎక్కువ పన్నులు చెల్లిస్తున్న రాష్ట్రాలు ఆదాయంలో ఎక్కువ కోరుకోవడం సమర్థనీయమైనా.. కేంద్రం ఎలా స్పందిస్తుంది? ఎలాంటి విధానం అమలు చేయనుంది అన్నదే ఉత్కంఠ రేపుతోంది. కేంద్ర ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వం నిరసన తెలుపుతోంది.
కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయింది.. ఈసారి 40 సీట్లు కూడా రావు: ప్రధాని మోదీ