ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు… పీఓకే ను భారత్ లో కలిపేస్తాం

  • Published By: chvmurthy ,Published On : January 11, 2020 / 11:37 AM IST
ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు… పీఓకే ను భారత్ లో కలిపేస్తాం

Updated On : January 11, 2020 / 11:37 AM IST

పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయం పై ఆర్మీ చీఫ్ జనరల్  మనోజ్ ముకుంద్ నవరణే  సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే వెనక్కి తెచ్చుకోవాలని పార్లమెంట్ ఆదేశిస్తే ఆపరేషన్ పీఓకే నిర్వహించి భారత్ లో కలిపేసేందుకు తమ సైన్యం సిధ్దంగా ఉందని ఆయన తెలిపారు. జనవరి 11, శనివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ…. సరిహద్దు వెంట ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఆర్మీ సర్వసన్నద్ధంగా ఉందని చెప్పారు.

భారత ఆర్మీ ఎప్పుడూ హుందాగా వ్యవహరిస్తుందని, పాకిస్థాన్‌లా అనాగరికంగా సామాన్యులపై కాల్పులకు దిగడం లాంటివి చేయదని, శత్రువును నేరుగా ఎదుర్కొంటామని చెప్పారు. జమ్మూకశ్మీర్ భారత అంతర్భాగమని పార్లమెంట్ తీర్మానం చేసిందని.. ఒకవేళ పీఓకె కూడా మనకే చెందాలని భావిస్తే.. దానిపై పార్లమెంట్‌లో తీర్మానం చేయాల్సి ఉంటుందని అన్నారు. ఆ తీర్మానంపై తమకు ఆదేశాలు అందితే పీఓకెపై చర్యలకు రెడీ ఉన్నామని ఆయన చెప్పారు.

 

చైనా సరిహద్దులు గురించి 
పాక్‌తో పాటు చైనా సరిహద్దుల్లోనూ సైన్యం సమానంగా దృష్టి పెట్టాల్సి ఉందని ఆర్మీ చీఫ్ వివరించారు. ఈ విషయంలో సైన్యాన్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నామని తెలిపారు. చైనా ఆర్మీ వెస్ట్రన్ కమాండ్‌తో త్వరలో భారత మిలటరీ ఆపరేషన్స్ డీజీకి హాట్ లైన్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.  దీనివల్ల సరిహద్దు వెంట ఏ సమస్యలు రాకుండా రెండు దేశాల మధ్య అవగాహన ఏర్పడుతుందని మనోజ్ ముకుంద్ తెలిపారు. జమ్ము, కాశ్మీర్తో సహా సరిహద్దులో ఉన్న ప్రతి సైనికుడూ నిరంతరం అప్రమత్తంగా ఉంటారని, ప్రజల మద్దతు తమకు ఉందని ఆయన అన్నారు. మిలటరీ పోలీసు విభాగాల్లోకి త్వరలో మహిళల్ని తీసుకోబోతున్నట్లు తెలిపారు. జనవరి 6న తొలి బ్యాచ్ కింద 100 మంది మహిళా జవాన్లకు శిక్షణ మొదలైందని చెప్పారు ఆర్మీ చీఫ్.
 

 

పాక్ సరిహద్దులు గురించి 
ఎల్ఓసీ వద్ద పాక్ ఆర్మీ, ఉగ్రవాదుల నుంచి  భారత్ సైన్యానికి ఎదురవుతున్న ముప్పును  గురించి ప్రస్తావిస్తూ…. ఎల్ఓసీ వెంబడి అత్యంత అప్రమత్తతో ఉంటున్నామని…. ప్రతిరోజూ నిఘా వర్గాల నివేదికలు అందుతుంటాయని చెప్పారు. వచ్చిన ఇంటిలిజెన్స్ రిపోర్టులను చాలా సీరియస్‌గానే పరిగణించి పాకిస్థాన్ ప్రత్యేక బలగాల చర్యలను సమర్ధవంతంగా తిప్పికొడుతుంటామని చెప్పారు. 

 

జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దుచేసిన  తర్వాత… కేంద్ర ప్రభుత్వం తదుపరి లక్ష్యం పాక్ ఆక్రమిత కశ్మీరేనని…..పీఓకెను కూడా స్వాధీనం చేసుకోవాలని పలువురు కేంద్రమంత్రులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి ఎస్ జైశంకర్ పీఓకె భారత అంతర్భాగమని గతేడాది సెప్టెంబర్‌లో వ్యాఖ్యానించారు. అంతేకాదు,ఏదో ఒకరోజు దానిపై భౌతిక చర్యకు దిగుతామని చెప్పారు.