ఆర్మీ నియామకాల స్కాంలో 23మందిపై సీబీఐ కేసు

ఆర్మీ నియామకాల్లో అవకతవల కేసులో 23 మందిపై కేసు నమోదైంది. ఈ కేసుకి సంబంధించి దేశవ్యాప్తంగా 13 సిటీల్లోని 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI).

ఆర్మీ నియామకాల స్కాంలో 23మందిపై సీబీఐ కేసు

Army Officers

Updated On : March 15, 2021 / 9:52 PM IST

Army Officers ఆర్మీ నియామకాల్లో అవకతవల కేసులో 23 మందిపై కేసు నమోదైంది. ఈ కేసుకి సంబంధించి దేశవ్యాప్తంగా 13 సిటీల్లోని 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI). కపూర్తల, బతిండా, దిల్లీ, కైతల్, పల్వాల్, లఖ్​నవూ, బరేలీ, గోరఖ్​పుర్​, విశాఖపట్నం, జైపూర్, గువాహటి, జోర్హట్, చిరాంగన్​లలోని బేస్ ఆస్పత్రి, కంటోన్మెంట్, ఇతర ఆర్మీ సముదాయాలు, పౌరుల నివాసాలు సహా 30 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేసింది.

సోదాల సమయంలో నేరారోపణలకు సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. ఈ కేసుకి సంబంధించి మొత్తం 23 మందిపై సీబీఐ కేసులు నమోదు చేయగా..అందులో ఆరుగురు లెఫ్టినెట్​ కర్నల్​​ స్థాయి అధికారులు, 11 మంది సైనికాధికారులు,ఆరుగురు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు.

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా జరిగిన జనరల్‌ డ్యూటీ పర్సనల్స్‌ ఎంపికలో పేపర్‌ ముందే బయటకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ముందస్తు సమాచారంతో.. పూణేలో స్థానిక పోలీసులతో కలిసి సైన్యం సంయుక్త ఆపరేషన్‌ చేసి దీనిని భగ్నం చేసింది. ఆ తర్వాత పరీక్షను రద్దు చేశారు. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో పుణెలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆర్మీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసును ఆదివారం సీబీఐకి బదిలీ చేసింది సైన్యం. ఎంపిక కేంద్రాల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న అంశం బయటపడిన నేపథ్యంలో అప్రమత్తమైన సైన్యం ఈ మేరకు చర్యలు చేపట్టింది.

అయితే, న్యూ ఢిల్లీలోని బేస్ హాస్పిటల్ లో..అభ్యర్థులు వైద్య పరీక్షలను పూర్తి చేయడానికి వారికి సహాయం చేసినందుకు లంచాలు స్వీకరించడంలో ఆర్మీ సిబ్బంది పాల్గొన్నారని సిబీఐకి గత నెలలో ఫిర్యాదు వచ్చింది. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కార్ప్స్ కి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ భగవాన్.. రిక్రూట్మెంట్ రాకెట్ సూత్రధారిగా సీబీఐ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం స్టడీ లీవ్‌లో ఉన్న లెఫ్టినెంట్ కల్నల్ భగవాన్ మరియు నాయిబ్ సుబేదార్ కుల్దీప్ సింగ్ కూడా ఎస్‌ఎస్‌బి కేంద్రాలలోని ముఖ్యమైన వ్యక్తుల నుంచి లంచాలు అందుకున్నారని సీబీఐకి వచ్చిన ఫిర్యాదులో పేర్కొనబడింది. సీబీఐ తాజాగా కేసు నమోదు చేసిన వ్యక్తుల్లో ఆయన పేరు కూడా ఉంది.