Road Accident : లద్దాఖ్ లో ఘోర ప్రమాదం.. లోయలో పడిపోయిన ఆర్మీ వాహనం, 9 మంది సైనికులు మృతి
లేహ్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలోని ఖేరీ ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Ladakh road accident
Ladakh Road Accident : లద్దాఖ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖేరీ సమీపంలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల్లో ఒకరు జెసీఓ కాగా, మిగిలిన ఎనిమిది మందిలో జవాన్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
లేహ్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలోని ఖేరీ ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. నిన్న (శనివారం) సాయంత్రం 4.45 గంటల సమయంలో లేహ్ నుంచి నైనా వైపు వెళ్తుండగా వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో వాహనంలో 10 మంది సైనికులు ప్రయాణిస్తన్నారు.
సమాచారం తెలియగానే పోలీస్ బృందం వెంటనే ఘటనా స్థలికి చేరుకుని, గాయపడిన సైనికులను ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే 8 మృతి చెందగా, ఒక సైనికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మరో సైనికుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
లద్దాఖ్ లో జరిగిన ప్రమాదంలో వీర సైనికులను కోల్పోవడం బాధాకరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ విషాధ సమయంలో యావత్తు దేశం మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అమరులైన జవాన్లకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Onions: ఉల్లి ధరలు మరింత కన్నీరు తెప్పించకుండా.. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఈ ఘటనలో గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ మేరకు ట్వీట్ చేశారు. లద్దాఖ్ లో జరిగిన ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ విచారం వ్యక్తం చేశారు. భారత మాత వీర పుత్రులకు వినయ పూర్వకంగా నివాళులర్పిస్తున్నట్లుగా ట్వీట్ చేశారు.
ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని, గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ బాధను తట్టుకునే శక్తిని మృతుల కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని భగవంతున్ని వేడుకుంటున్నట్లు తెలిపారు.