క్షీణించిన తరుణ్ గొగోయ్ ఆరోగ్యం…

  • Published By: sreehari ,Published On : November 22, 2020 / 06:59 AM IST
క్షీణించిన తరుణ్ గొగోయ్ ఆరోగ్యం…

Updated On : November 22, 2020 / 8:18 AM IST

Tarun Gogoi : అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ (86) ఆరోగ్య పరిస్థితి విషమించింది. శరీరంలో కీలక అవయవాలు వైఫల్యం చెందడంతో ఆయన తీవ్ర శ్వాసకోశ సమస్యతో ఇబ్బందిపడ్డారు. దాంతో వైద్యులు వెంటనే గొగోయ్‌కు వెంటిలేటర్ అమర్చారు. ఈ మేరకు అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమంతా బిశ్వా శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.



కొన్ని వారాలుగా తరుణ్ గొగోయ్ ఆయాసంతో బాధపడుతున్నారు. గువాహటి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స చేశారు. అప్పుడే ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గొగోయ్‌ను ఐసీయూలో చికిత్స కోసం ప్లాస్మా థెరపీ అందించారు. తరుణ్ కోలుకున్నట్టే కనిపించారు. గత నెల 25న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.



కానీ, గొగోయ్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమంగా మారడంతో ఆసుపత్రికి తరలించారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా గొగోయ్ పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని మంత్రి శర్మ తెలిపారు. వైద్యులు డయాలసిస్ కూడా అందించారు.



గొగోయ్ ఆరోగ్య పరిస్థితి 48 గంటల నుంచి 72 గంటల వరకు విషమంగా ఉండొచ్చునని వైద్యులు చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత గొగోయ్ గతంలో మూడు సార్లు సీఎంగా పనిచేశారు. ఆగస్టు 25న గొగోయ్ కు కరోనా నిర్ధారణ కావడంతో మరుసటి రోజునే GMCH ఆస్పత్రిలో చేరారు.