“కరోనా దేవీ పూజ”…పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు

ప్రపంచమంతా ఇప్పుడు వేగంగా వ్యాప్తిచెందుతున్న కోవిడ్-19పై పోరాటం చేస్తోంది. మరోవైపు సైంటిస్టులు కరోనాకు వ్యాక్సిన్ లేదా మెడిసిన్ కనిపెట్టే ప్రయత్నాల్లో నియగ్నమై ఉన్నారు. ఈ సమయంలో అసోంలో చాలామంది ప్రాణంతకమైన ఈ కొత్త వైరస్ ను దేవతగా పూజించడం ప్రారంభించారు. శనివారం అసోంలో చాలామంది ప్రజలు,ముఖ్యంగా మహిళలు కరోనా దేవీ పూజ నిర్వహించారు.
అసోం రాజధాని గౌహతితో సహా భిశ్వనాథ్ చారియలి జిల్లా నుంచి దార్రంగ్ జిల్లా వరకు చాలామంది కరోనా దేవి పూజ నిర్వహించారు. భిశ్వనాథ్ చారియలిలో ఓ మహిళా గ్రూప్… నది ఒడ్డున కరోనా దేవి పూజ నిర్వహించారు. కరోనా దేవీ పూజ నిర్వహించామని,పూజ తర్వాత గాలి వస్తుందని,వైరస్ నాశనమై పోతుందని ఓ మహిళ తెలిపారు. కాగా,అసోంలో కరోనా కేసుల సంఖ్య 2వేల 500కు చేరింది.
మరోవైపు, దేశంలో కరోనా వైరస్ కేసులు సంఖ్య చాలా వేగంగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ కేసులు మూడు రోజులుగా 9 వేల నుండి 10 వేల మధ్య నమోదు అవుతున్నాయి. దేశంలో రెండున్నర లక్షలకు చేరువగా కరోనా కేసులు చేరుకున్నాయి. దీంతో ప్రపంచంలో కరోనావైరస్ కారణంగా దెబ్బతిన్న టాప్ 10 దేశాల లిస్ట్ లో 5వ స్థానంలో భారత్ నిలిచింది. ప్రస్తుతం ఇండియాకన్నా ముందు అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ ఉన్నాయి.