సహకార సమాఖ్యను మరింత బలోపేతం చేద్దాం.. దేశాభివృద్ధికి అదే మూలం

PM-Modi
PM Modi కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి, సహకార సమాఖ్య విధానాన్ని మరింత అర్థవంతంగా మార్చడమే భారతావని అభివృద్ధికి పునాది అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ నీతి ఆయోగ్ ఆరవ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ప్రధాని.. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పలు రాష్ట్రాల సీఎంలను ఉద్దేశించి మాట్లాడారు.
దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు నిండాయని.. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ తాజా సమావేశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడిందని ప్రధాని అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
కొవిడ్ సమయంలో కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. కరోనా విషయంలో దేశం విజయం సాధించిందని, ప్రపంచం ముందు భారత ప్రతిష్ఠ విరాజిల్లిందని పేర్కొన్నారు. పోటీ తత్వాన్ని, సహకార సమాఖ్య విధానాన్ని రాష్ట్రాలకే పరిమితం చేయకుండా జిల్లాలకూ విస్తరించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ఇక, గత కొన్ని ఏండ్ల నుంచి ఉచితంగా బ్యాంకు అకౌంట్లు కల్పిస్తున్నామని, వ్యాక్సినేషన్ ప్రక్రియ పెరిగిందని, ఆరోగ్య సదుపాయాలు కూడా పెరిగాయన్నారు. పేదల కోసం ఉచిత విద్యుత్తు కనెక్షన్లు, ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. ఈ సదుపాయాలు పేదల జీవితాల్లో పెను మార్పులు తీసుకువచ్చినట్లు ప్రధాని వెల్లడించారు.
వ్యాపారాలు సజావుగా సాగేలా పురాతన చట్టాలను తొలగించాల్సిన అవసరం ఉందని మోడీ అభిప్రాయపడ్డారు. ఆర్థిక పురోగతిలో ప్రైవేటు రంగానికి సరైన ప్రాతినిథ్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంలో భాగమయ్యేందుకు ప్రైవేటు రంగానికి అన్ని అవకాశాలు అందించాలన్నారు.
ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు ప్రధాని. సమయాన్ని వృథా చేయకుండా వేగంగా అభివృద్ధి సాధించాలని దేశం నిశ్చయించుకుందని చెప్పారు. దేశ మానసిక స్థితి ఈ విధంగా మారడంలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు.
వ్యవసాయ రంగంపై మాట్లాడిన ప్రధాని.. వంట నూనె తయారీపై దృష్టిసారించాల్సిన అవసరముందన్నారు. వాటి దిగుమతులను తగ్గించాలని అన్నారు. రైతులకు మార్గనిర్దేశనం చేస్తే ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని.. ఫలితంగా దిగుమతులపై వెచ్చించే సొమ్ము రైతుల ఖాతాల్లోకి వెళ్తుందన్నారు.