Australian PM : మార్చి 8 నుంచి 11 వరకు ఆస్ట్రేలియా ప్రధాని భారత్ పర్యటన ..
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ మార్చి 8 నుంచి 11వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ఇండియాలో పర్యటించనున్నారు.

Australian PM
Australian PM : ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ మార్చి 8 నుంచి 11వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ఇండియాలో పర్యటించనున్నారు. ప్రధాని వెంట పర్యటనలో సీనియర్ మంత్రులు, వ్యాపార ప్రతినిధులు ఉంటారు. ప్రధాని తన ఇండియా పర్యటనలో భాగంగా.. భారత ప్రధాని మోదీతో కలిసి ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న టెస్ట్ మ్యాచ్‌ను తొలిరోజు వీక్షిస్తారు. మార్చి 9నుంచి నాల్గోటెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే, 8న హోలీ రోజున ప్రధాని అల్బనీస్ అహ్మదాబాద్‌కు చేరుకుంటారు. మార్చి 9న ముంబయిని కూడా సందర్శిస్తారు. ఆరోజు తరువాత ఢిల్లీకి చేరుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
PM Modi : ప్రధాని మోదీని కలిసిన ఆస్ట్రేలియా ప్రధాని.. భారత్ లో రూ.1500 కోట్ల పెట్టుబడులు
మార్చి 10న ఢిల్లీలో ఆస్ట్రేలియా ప్రధానికి రాష్ట్రపతి భవన్ వద్ద లాంఛనంగా స్వాగతం పలకనున్నారు. ప్రధాని మోదీ, ప్రధాని అల్బనీస్ భారతదేశం – ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సహకార రంగాలపై చర్చించేందుకు వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలపై ఇరు దేశాల ప్రధానులు చర్చిస్తారు. అదేవిధంగా ఆస్ట్రేలియా ప్రధాని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముని కలుస్తారు.