Akhilesh Yadav : యోగి ఆదిత్యనాథ్ కు బ్యాడ్ డేస్
యూపీ సీఎం ఢిల్లీ పర్యటనపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సెటైర్లు వేశారు.

Bad Days Have Come For Yogi Adityanath Wandering Door To Door To Retain Cm Post Akhilesh Yadav
Akhilesh Yadav యూపీ సీఎం ఢిల్లీ పర్యటనపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సెటైర్లు వేశారు. యోగి ఆదిత్యానాథ్ కు గడ్డు రోజులు మొదలయ్యాయని, సీఎం పదవిని కాపాడుకునేందుకు ఆయన ఇల్లిల్లూ తిరుగుతున్నారని అఖిలేష్ యాదవ్ అన్నారు. యూపీ ప్రభుత్వంలో మార్పులు ఉండబోతున్నాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్న క్రమంలో అఖిలేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూపీలో బీజేపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని అఖిలేష్ అన్నారు.
కోవిడ్ నియంత్రణ విషయంలో యోగి సర్కార్ తీరుపై అఖిలేష్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలు కరోనా మహమ్మారితో బాధపడుతుంటే బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. యూపీలో కరోనా విస్తరిస్తుండటంతో పాటు బ్లాక్ ఫంగస్ చికిత్సలో మందుల కొరత వెంటాడుతోందని అఖిలేష్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మరణాలపై సరైన గణాంకాలు ఇవ్వడం లేదని యోగి సర్కార్ తీరును తప్పుపట్టారు.
మరోవైపు యూపీలో నాయకత్వ మార్పు తప్పదనే వార్తల నేపథ్యంలో సీఎం యోగి గురువారం రెండు రోజుల ఢిల్లీ పర్యటనకి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న యోగి ఆదిత్యనాథ్.. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డాలతో సమావేశమైన విషయం తెలిసిందే.