కరోనా రాకాసికి మరో సీనియర్ అధికారి మృతి

  • Published By: madhu ,Published On : July 14, 2020 / 01:05 PM IST
కరోనా రాకాసికి మరో సీనియర్ అధికారి మృతి

Updated On : July 14, 2020 / 1:27 PM IST

కరోనా రాకాసికి మరో సీనియర్ అధికారిణి మృతి చెందారు. ఎంతో తెగువతో, ధైర్య సాహసాలతో పని చేసిన ఆమె…ఇక మన మధ్యలో లేదనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. వైరస్ కట్టడిలో పోరు, విశేష సేవలందించిన ఆమె మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఆమె ఎవరో కాదు..వెస్ట్ బెంగాల్ లో విశేష సేవలందించిన ప్రభుత్వ అధికారి దేబ్ దత్తా (38). సీఎం మమత బెనర్జీ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలియచేశారు. రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ సేవలను అందించిన ఆమె మరణం తీరని లోటని ట్వీట్‌ చేశారు. ప్రభుత్వం తరపున, ఆమె సేవలకు సెల్యూట్‌ చేస్తున్నానన్నారు.

ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు కరోనాతో మరణించడం తమ రాష్ట్రంలో ఇదే తొలిసారి అని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
హుగ్లీ జిల్లాలోని చందానగర్ సబ్ డివిజన్ డిప్యూటీ మేజిస్ట్రేట్ దేబ్ దత్తా కరోనా వైరస్ కట్టడికి ఎంతో శ్రమించారు.

అయితే..ఇటీవలే వైరస్ లక్షణాలతో హోం ఐసోలేషన్ కు వెళ్లారు. అకస్మాత్తుగా ఆదివారం శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో సెరాంపూర్ లోని శ్రమజీవి ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో 2020, జులై 13వ తేదీ సోమవారం కన్నుమూశారు. ఆమెకు భర్త, నాలుగేళ్ల కుమారుడున్నారు.

ఈ విషయం తెలుసుకున్న తోటి ఉద్యోగులు కన్నీరుమున్నీరయ్యారు. మానవత్వం, క్లిష్ట వ్యవహారాలను కూడా సునాయసంగా పరిష్కరించే వారని కొనియాడారు. ఆమె చేసిన పనులను గుర్తు చేసుకుని విషాదంలో మునిగిపోయారు.