TMC Leader Head Shave: టీఎంసీ నేతకు గుండు గీసి.. చెప్పుల దండ వేసి ఊరేగింపు.. సన్యాసి మున్నాపై తిరగబడ్డ బెంగాల్ జనం
తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సన్నాశి మన్నా(TMC Leader Sanyasi Munna)పై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
bengal howrah village parade tmc leader with shoe garland for cut money
- టీఎంసీ నేతకు గుండు, చెప్పుల దండ.
- అవినీతి వసూళ్లపై తిరగబడిన బెంగాల్ గ్రామస్తులు.
- రంగంలోకి దిగి రక్షించిన స్థానిక పోలీసులు.
TMC Leader Sanyasi Munna: పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లా అమర్ దహా గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇప్పిస్తానని చెప్పి లబ్ధిదారుల నుండి పెద్ద ఎత్తున నిధులు వసూలు చేశాడనే ఆరోపణలపై స్థానిక తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకుడు సన్నాశి మన్నా(Tmc Leader Sanyasi Munna)పై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అక్రమ వసూళ్లపై జనం తిరగబడ్డారు. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రజలు ఆ నాయకుడిని పట్టుకుని, నడిరోడ్డుపై కూర్చోబెట్టి బలవంతంగా గుండు గీశారు. ఆపై మెడలో చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
*Supreeth Reddy: ఉబర్ డ్రైవర్‌పై ఛత్రపతి నటుడు దాడి.. ఫోన్ లాక్కుని హల్చల్.. కీసరలో కాట్రాజ్ రచ్చ
ఇంటిపై దాడి.. లభించిన ఆధారాలతో పెరిగిన ఆగ్రహం:
ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారి, బీజేపీ విజయం సాధించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో అక్కడి ప్రజల్లో ధైర్యం పెరిగింది. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులంతా సన్నాశి మన్నా ఇంటిని ముట్టడించి, తాము గతంలో ఇచ్చిన డబ్బులను వెంటనే తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అతని నివాసంపై దాడి చేయగా, లబ్ధిదారులకు సంబంధించిన పలు గుర్తింపు కార్డులతో పాటు, ఉపాధి హామీ పథకానికి చెందిన జాబ్ కార్డులు పెద్ద సంఖ్యలో లభ్యమయ్యాయి. అవినీతికి సంబంధించిన ఈ పక్కా ఆధారాలు దొరకడంతో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
రంగంలోకి పోలీసులు.. విచారణకు ఆదేశం:
నాయకుడిని వీధుల్లో ఊరేగిస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అమర్ దహా గ్రామానికి చేరుకున్నారు. ఆగ్రహించిన ఆందోళనకారుల నుండి సన్నాశి మన్నాను రక్షించి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక ఉన్నతాధికారి మాట్లాడుతూ.. బాధితుడిని సురక్షితంగా రక్షించామని, ప్రస్తుతం గ్రామంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అదే సమయంలో, నిందితుడిపై గ్రామస్థులు చేసిన తీవ్రమైన అవినీతి ఆరోపణలు, కట్ మనీ వసూళ్లపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
