ఫ్రీగా టమాటాలు పంపిన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్.. మండిపడ్డ వ్యక్తి

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన ఓ వ్యక్తికి ఇటువంటి అనుభవమే ఎదురైంది.

ఫ్రీగా టమాటాలు పంపిన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్.. మండిపడ్డ వ్యక్తి

Updated On : October 14, 2024 / 9:31 AM IST

ఆన్‌లైన్‌లో మనం ఏది ఆర్డర్‌ చేస్తే అది మన ఇంటికి వస్తుంది. మనం ఆర్డర్‌ చేసిన వాటితో పాటు ఆర్డర్‌ చేయనివి కూడా మన ఇంటికి వస్తే ఎలా ఉంటుంది? మనకు అవసరం లేని పదార్థాలు, వస్తువులను కూడా మనకు అంటగడితే ఎలా ఉంటుంది? మనకు అనవసరమైన వస్తువులు ఉచితంగా వచ్చినా మనకు చిరాకు వస్తుంది.

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన ఓ వ్యక్తికి ఇటువంటి అనుభవమే ఎదురైంది. బెంగుళూరుకు చెందిన ఒక వ్యక్తి జొమాటో ఇన్‌స్టామార్ట్‌లో తనకు కావాల్సిన పదార్థాలు ఆర్డర్‌ చేశాడు. అతడికి ఆ పదార్థాలతో పాటు అరకిలో టమాటాలు కూడా వచ్చాయి. టమాటాలను ఫ్రీగా ఇస్తున్నామని జొమాటో యాప్‌లో పేర్కొన్నారు.

తాను టమాటాలను ఆర్డర్‌ చేయకపోయినా, తనకు బలవంతంగా వాటిని పంపారంటూ ఆ వ్యక్తి మండిపడ్డాడు. తాను ఆర్డర్‌ చేసేటప్పుడు తన కార్ట్ నుంచి అనవసరమైన వస్తువును తీసివేయడానికి ఆప్షన్‌ లేకుండాపోయిందని అన్నాడు.

ఈ తీరు బాగోలేదని, ఇలా ఉచితంగా అవసరం లేని పదార్థాలను అందించడం ఏంటని, జొమాటో కస్టమర్లకు అందిస్తున్న ఈ సర్వీసును డిజైన్‌ చేసిన తీరు బాగోలేదని విమర్శించాడు. టమాటాలు ఉచితంగా పొందడం తన సమస్య కాదని, అయితే, తాను ఆర్డర్‌ చేసినవాటిని మాత్రమే తీసుకునే స్వేచ్ఛను కలిగిస్తే బాగుండేదని అన్నాడు. అతడు చేసిన ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

AP Rains: ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు