Drumstick prices: ఫెంగల్ తుపాన్ ఎఫెక్ట్.. కిలో మునగకాయలు రూ.500
గత వారం మునగకాయలు కిలో రూ.150కి అమ్ముడయ్యాయి. ఇప్పుడు అవే భారీగా పెరిగి కిలో రూ.500కు చేరుకున్నాయి.

బెంగుళూరులో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ నగరంలో మునగకాయల ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో రూ.500కి చేరుకున్నాయి. ఇక ఉల్లి కిలో రూ.70-80కి పెరిగింది.
ఫెంగల్ తుపాన్ కారణంగా కూరగాయల పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటకలో అకాల వర్షం బీభత్సం సృష్టించి, తీవ్ర పంట నష్టాన్ని కలిగించింది. బెంగళూరు రూరల్, రామనగర, చామరాజనగర, మైసూరు, కోలార్, చిక్కబళ్లాపుర, మాండ్య జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా అనేక కూరగాయల పంటలు ధ్వంసమయ్యాయి.
దీంతో బెంగళూరు మార్కెట్‌లో ధరలు పెరిగాయి. ఇప్పటికే బాగా డిమాండ్ ఉన్న మునగకాయల వంటి కూరగాయలను సామాన్యులు కొనలేకపోతున్నారని కళాసిపాళయ స్థానిక వ్యాపారి అన్వర్ బాషా అన్నారు. రిటైల్ మార్కెట్‌లో మునగకాయ ధరలు ఇప్పుడు కిలో రూ. 500కి చేరుకున్నాయని, ఒక్కో మునగ రూ.50గా ఉందని మరో వ్యాపారి చెప్పారు.
గత వారం మునగకాయలు కిలో రూ.150కి అమ్ముడయ్యాయి. ఇప్పుడు అవే భారీగా పెరిగి రూ.500కు చేరుకున్నాయి. ఫెంగల్ తుపానుకు తోడు మరికొన్ని కారణాల వల్ల ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. సాధారణంగా తమిళనాడులోనే కూరగాయలు బాగా పండుతాయని, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇప్పుడు తాము కూడా మహారాష్ట్ర నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు.
Rains in AP: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం