ఇంట్లోనే COVID-19 టెస్టులు.. బెంగళూరు స్టార్టప్ కంపెనీ ప్రయోగం

ఇంట్లోనే COVID-19 టెస్టులు.. బెంగళూరు స్టార్టప్ కంపెనీ ప్రయోగం

Updated On : April 3, 2020 / 4:55 PM IST

బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ బయోనె వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త ప్రయోగానికి తెరదీసింది. దీని ద్వారా జెనెటిక్, మైక్రోబయోమ్ పద్ధతి ద్వారా టెస్టు చేసి ఇంట్లోనే కొవిడ్-19 ఉందా అనే విషయాన్ని కన్ఫామ్ చేసుకోవచ్చు. దీనిని ఓ వారంలోగా మార్కెట్లో ఉంచుతామని కంపెనీ యాజమాన్యం తెలిపింది. 

అమెరికాలో మా పార్టనర్స్ నుంచి స్క్రీనింగ్ కిట్ ను దిగుమతి చేసుకుంటున్నాం. దీనికి యూఎస్ఎఫ్డీఏ ఆమోదం కూడా ఉంది. ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ నుంచి సర్టిఫికేషన్ కూడా తీసుకున్నాం. కొవిడ్-19 భయం నుంచి ఈ కిట్ కాస్త ఉపశమనాన్ని ఇవ్వగలదని కంపెనీ స్థాపకులైన సురేంద్ర కే చికారా అన్నారు. 

లాక్ డౌన్ సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండానే స్క్రీనింగ్ కిట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీని ద్వారా వైరస్ ఇతరులకు సోకకుండా కూడా జాగ్రత్త పడగలం. ఐసోలేషన్ లో ఉన్నవారికి ఇలాంటి పరికరం తప్పకుండా ఉండాలి. దీని ధర సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుంది. కేవలం రూ.2వేల నుంచి రూ.3వేలలో సప్లై చేయాలనుకుంటున్నాం. డిమాండ్ ను బట్టి ప్రొడక్షన్ ను పెంచుతాం అని ఆయన అన్నారు. 

ఈ స్క్రీనింగ్ కిట్ సహాయంతో 5నుంచి 10నిమిషాల్లోపే రిజల్ట్ తెలిసిపోతుంది. ఈ కిట్ వాడేముందు వినియోగదారుడు వేలిపై ఆల్కహాల్ ను వేసి దూదితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కిట్‌లోని స్లాట్ పై వేలిని కాసేపటి వరకూ ఉంచాలి. కార్ట్ రిడ్జ్ బ్లడ్ శాంపుల్ తీసుకుంటుంది. 5నుంచి 10నిమిషాల్లో ఫలితం ఏంటనేది చెప్పేస్తుందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. (వాహ్.. క్రికెట్ స్టేడియాన్ని కరోనా టెస్టింగ్ సెంటర్‌గా మార్చారు)

డా. సురేంద్ర కే చికారా బయోనె కంపెనీని 2019లో బెంగళూరులో స్థాపించారు. కంపెనీ వారానికి 20వేల కిట్ లు వరకూ సప్లై చేయగలదు. డిమాండ్ పెరిగితే అంతకంటే ఎక్కువ సరఫరా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.