MS Swaminathan : హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌కి భారతరత్న

వ్యవసాయం, రైతు సంక్షేమం కోసమే జీవితం అంకితం చేసిన ఎంఎస్ స్వామినాథన్‌ని భారతరత్న పురస్కారం వరించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

MS Swaminathan : హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌కి భారతరత్న

MS Swaminathan

Updated On : February 9, 2024 / 2:43 PM IST

MS Swaminathan : వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం భారతదేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఎంఎస్ స్వామినాథన్‌కి భారతరత్న వరించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో వెల్లడించారు.

Bharat Ratna 2024 : 61 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తేజానికి ‘భారతరత్న’

వ్యవసాయరంగంలో ఎంఎస్ స్వామినాథన్ కీలక పాత్ర పోషించారు. భారతీయ వ్యవసాయ విధానాలు ఆధునీకరించే దిశగా అద్భుతమైన ప్రయత్నాలు చేశారు. ఆయన చేపట్టిన విధానాలు భారత వ్యవసాయరంగాన్ని మార్చడమే కాకుండా దేశ ఆహార భద్రత, శ్రేయస్సుకి ఎంతగానో ఉపకరించాయి. స్వామినాథన్ 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. డా ఎంకె.సాంబశివన్, పార్వతి తల్లిదండ్రులు. 11 సంవత్సరాల వయసులో తండ్రి చనిపోయారు.1943లో బెంగాల్‌లో భయంకరమైన కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు భారతదేశంలో ఆకలిని తొలగించడానికి తన జీవితాన్ని అంకితం చేయాలని స్వామినాథన్ నిర్ణయించుకున్నారట. 1955 తో మీనాతో స్వామినాథన్‌కు వివాహమైంది. 1951 లో కేంబ్రిడ్జిలో చదువుకున్నప్పుడు వీరిద్దరి పరిచయం వివాహానికి దారి తీసింది. వీరికి ముగ్గురు కుమార్తెలు. డా.సౌమ్యా స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు డిప్యూటీ డైరెక్టర్‌గాను, రెండవ కుమార్తె డా.మధుర స్వామినాథన్ బెంగళూరులోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్‌లో ఆర్ధిక శాస్త్రంలో అధ్యాపకురాలిగా.. మూడవ కుమార్తె నిత్యా స్వామినాథన్ ఉత్తర అంగోలియా విశ్వవిద్యాలయంలో సీనియర్ అధ్యాపకురాలిగా ఉన్నారు. మీనా స్వామినాథన్ 88 సంవత్సరాల వయసులో 2022 లో కన్నుమూసారు.

సోషలిస్టు నాయకుడు, దివంగత మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కి భారతరత్న

స్వామినాథన్ 1949-55 మధ్యకాలంలో బంగాళాదుంప, గోధుమ, వరి, జనపనార జన్యువులపై పరిశోధనలు చేశారు. 1972 నుంచి 79 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థలో స్వామినాథన్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు.. 1979 నుంచి 1980 వరకు వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శి, 1982 నుంచి 1988 వరకు అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహించారు. 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన సారథ్యంలో అనేకమంది విద్యార్ధులు పీహెడీ చేశారు. ఆయనను గతంలో పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు వరించాయి. 1987 లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు కూడా వచ్చింది. 1971లో రామన్ మెగసేసె అవార్డు, 1986లో అల్బర్డ్ ఐన్ స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు దక్కింది. 98 సంవత్సరాల వయసులో ఎంఎస్.స్వామినాథన్ 2023 సెప్టెంబర్ 28న చెన్నైలో కన్నుమూశారు. వ్యవసాయరంగంలో స్వామినాథన్‌ చేసిన సేవలకు గుర్తింపుగా భారత అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ వరించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వామినాథన్ సేవలను స్మరిస్తూ ఈ పురస్కారాన్ని ట్విట్టర్ లో ప్రకటించారు.