హెల్త్ సెక్రటరీయే కొడుకునుదాచి, కరోనాను తనతోపాటు మిగిలినవాళ్లకూ అంటించింది…కరోనా హాట్ స్పాట్ గా భోపాల్ ఆరోగ్యశాఖ

  • Published By: venkaiahnaidu ,Published On : April 12, 2020 / 08:20 AM IST
హెల్త్ సెక్రటరీయే కొడుకునుదాచి, కరోనాను తనతోపాటు మిగిలినవాళ్లకూ అంటించింది…కరోనా హాట్ స్పాట్ గా భోపాల్ ఆరోగ్యశాఖ

Updated On : April 12, 2020 / 8:20 AM IST

మధ్యప్రదేశ్ ఆరోగ్యశాఖనే ఇప్పుడు ఆ రాష్ట్రంలో అతిపెద్ద వైరస్ హాట్ స్పాట్ గా మారింది. రాజధాని భోపాల్ లో నమోదైన 121 కరోనా కేసుల్లో సగానికిపైగా కేసులు హైల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు,వారి కుటుంబసభ్యులవే కావడం ఇప్పడు అందరిలో ఆందోళన కలిగిస్తోంది. సొంతశాఖలోని ఉన్నతాధికారులే వైరస్ వ్యాపింపజేయడం కలకలం రేపుతున్నది. ఒక్కరో ఇద్దరో కాకుండా, ఏకంగా ఆరోగ్య శాఖ కీలక యంత్రాంగమంతా క్వారంటైన్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైరస్ రాజ్ భవన్ దాకా వెళ్లినట్లు కూడా వార్తలు వినిపించడం కలకలం రేపుతోంది.

మధ్యప్రదేశ్ లో కరోనా మరణాల రేటు మిగతా ప్రభావిత రాష్ట్రాల్లో పోల్చితే చాలా ఎక్కువగా ఉంది. ఆదివారం ఉదయం నాటికి అక్కడ 532మందికి వైరస్ సోకితే, అందులో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా రాజధాని భోపాల్, ఆర్థిక రాజధాని ఇండోర్ సిటీల్లో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. భోపాల్ సిటీలో సగానికిపైగా కేసులు ఆరోగ్య శాఖలోనివే. గత రెండు వారాలుగా అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు చేసిన భారీ తప్పిదాల వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పల్లవి జైన్ గోవిల్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొడుకు హిస్టరీ దాచిపెట్టి
రెండు విధాలుగా మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ వైరస్ హాట్ స్పాట్ గా మారింది. మార్చి చివరి వారంలో డిసీజ్ సర్వేలెన్స్ అధికారి ఒకరు ఇండోర్ నుంచి భోపాల్ కు బస్సులో ప్రయాణించారు. తుమ్ములు, దగ్గులతోనే రెండు రోజులపాటు ఆయన హెడ్ క్వార్టర్స్ లోని ఇతర సిబ్బందితో కలిసి పనిచేశారు. జ్వరం కూడా రావడంతో ఆయన్ని ఇంటికి పంపించారు. తర్వాత అక్కడివాళ్లంతా పాజిటివ్ గా తేలారు. ఈలోపే హెల్త్ సెక్రటరీ పల్లవి జైన్ వ్యవహారం బయటపడింది. ఆమె కొడుకు ఇటీవల అమెరికా నుంచి తిరిగొచ్చిన విషయాన్ని రహస్యంగా దాచేశారు. రోజూ సెక్రటేరియట్ కు వెళుతూ కోవిడ్-19 నియంత్రణ చర్యల్ని పర్యవేక్షించారు. రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ కు పరిస్థితి నివేదించడం లాంటివి కూడా చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ అధికారి వచ్చినప్పుడు.. నిబంధనలకు విరుద్ధంగా 100 మందితో స్వాగత ఏర్పాట్లు చేశారు. తీరా తను పాజిటివ్ పేషెంట్ అని తేలిన తర్వాత కూడా ఆమె తీరు మారలేదు.

35మంది హెల్త్ డిపార్మెంట్ అధికారులకు కరోనా 
కరోనా టెస్టుల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత కూడా పల్లవి జైన్ ఇంటి నుంచి పనిచేశారు. ఆ సమయంలోనూ చాలా మంది సిబ్బంది ఆమెను కలిశారు. కనీసం మాస్క్ కూడా వాడకుండా, డాక్టర్లతో ఆమె వ్యవహరించిన తీరుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. పల్లవి జైన్, డిసీజ్ సర్వేలెన్స్ అధికారి.. ఈ ఇద్దరి కారణంగా మధ్యప్రదేశ్ లో మొత్తం 35 మంది హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు, 50 మంది వైద్య సిబ్బందికి, 12 మంది పోలీసులకు వైరస్ అంటుకుంది. ముందువరుసలో ఉండి పనిచేయాల్సిన వీళ్లంతా ఇప్పుడు క్వారంటైన్ కు పరిమితమైపోయారు.

వైరస్ వీరవిహారం చేస్తోన్న మధ్యప్రదేశ్ లో సీనియర్ అధికారులు చాలా మంది క్వారంటైన్ లో ఉండిపోగా, పనులన్నీ జూనియర్ల సారధ్యంలో సాగుతున్నాయి. పైగా ఆ శాఖకు మంత్రి కూడా లేడు. ఓవైపు కరోనా వ్యాప్తిస్తుండగానే, రాజకీయ హైడ్రామాతో బీజేపీ అధికారంలోకి రావడం, మార్చి 23న శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి లాక్ డౌన్ కొనసాగుతుండటంతో మంత్రి మండలి ఏర్పాటుకాలేదు.