బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : తేజస్వీ యాదవ్ కే పట్టం ?

bihar assembly election 2020 : బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుదిఘట్టం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. మొదటి దశలో 71 స్థానాలకు అక్టోబర్ 28న పోలింగ్ జరిగింది. రెండోదశలో 94 స్థానాలకు నవంబర్ 3న ఎన్నికలు జరిగాయి. చివరిదశలో 78 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ప్రధాన పోటీ : –
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్డీయే కూటమి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహా ఘట్‌బంధన్‌కు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. జేడీయు 115 స్థానాలు, బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేశాయి. మహా కూటమిలో ఆర్జేడీ 144 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేశాయి.
మహా ఘట్ బంధన్ : –
బీహార్‌లో మహాఘట్ బంధన్ వైపే సర్వేలే మొగ్గు చూపాయి. తేజస్వీ యాదవ్ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ అంచనా వేస్తున్నాయి. మహాఘటన్ బంధన్ స్వల్ప ఆధిక్యత సాధిస్తుంది అని అభిప్రాయపడ్డాయి. మొత్తం మూడు దశల్లో 243 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ఈ నెల 10న వెలువడనున్నాయి.
తుది దశ ప్రశాంతం : –
మరోవైపు తుది దశ పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగియగా.. మోతిహరి, దర్బంగా, కటిహార్ ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగలేదని ప్రజలు ఓటు వేయలేదు. దీంతో పోలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి. ఓటర్లను ఒప్పించేందుకు అధికారులు యత్నించారు.
ఓటు వేసిన వృద్ధుడు : –
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఓ వృద్ధుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాడు. మంచంలోంచి లేవలేని పరిస్థితుల్లో కూడా ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు వెళ్లాడు. కతిహర్‌లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధున్ని మంచంతోనే పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు స్థానికులు. ఓటు వేయడం అందరి బాధ్యత అని ఆయన అన్నాడు.