Bihar Assembly Election : ఓటరు ఎటువైపు ? ఎగ్జిట్ పోల్స్ నిజమౌతాయా ?

nitish and tejashwi Yadav
Bihar Assembly elections : బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుదిఘట్టం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. మొదటి దశలో 71 స్థానాలకు అక్టోబర్ 28న పోలింగ్ జరిగింది. రెండో దశలో 94 స్థానాలకు నవంబర్ 3న ఎన్నికలు జరిగాయి. చివరి దశలో 78 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీయే కూటమి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహా ఘట్‌బంధన్‌కు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. జేడీయు 115 స్థానాలు, బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేశాయి. మహా కూటమిలో ఆర్జేడీ 144 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేశాయి. వీటితో పాటు చిన్న చితకా పార్టీలు కూటమిగా ఏర్పడి బరిలోకి దిగాయి. ఎల్జేపీ ఒంటరిగా బరిలోకి దిగింది.
ఓటరు ఏ పార్టీని కరుణిస్తారన్నది అంతు చిక్కడం లేదు. దీంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. బీహార్‌లో ఓటరు నాడిని పసిగట్టడంతో ఎగ్జిట్ పోల్స్ దారుణంగా విఫలమైన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. నిజానికి ఓపీనియన్ పోల్స్ కంటే భిన్నంగా.. ఆయా పోలింగ్ బూత్ ల వద్ద నేరుగా ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఎగ్జిట్ పోల్స్ ను రూపొందిస్తారు. గతంలో అవి కూడా తారుమారైన నేపథ్యంలో ఈసారైనా ఎగ్జిట్ పోల్స్ ఫలిస్తాయా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2015 బీహార్ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ జాతీయ ఛానెళ్లు చేసిన పోల్ సర్వేలన్నీ తప్పుగా తేలాయి. యాక్సిస్ ఏపీఎం సంస్థ తప్ప ఏ ఒక్కరూ సరైన అంచనాలను వెలువరించలేదు. నాటి బీహార్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బంపర్ మెజార్టీ సాధిస్తుందని చాణక్య టుడే, ఏబీపీ-నిల్సన్, ఇండియా టుడే-సిసిరో, ఎన్డీటీవీ లాంటి బడా సంస్థలు అంచనా వేశాయి. ఒక్క యాక్సిస్ ఏపీఎం సంస్థ మాత్రమే నితీశ్-లాలూ నేతృత్వంలోని మహా కూటమికి 169 నుంచి 183 సీట్లు దక్కుతాయని సరిగ్గా అంచనా వేసింది. 2015 ఎన్నికల్లో మహాకూటమికి 178 సీట్లు దక్కగా, ఎన్డీఏకు కేవలం 56 సీట్లు దక్కాయి. అందులో బీజేపీ వాటానే 52. సీపీఐ ఎంల్ 3, ఇండిపెండెంట్లకు 4 స్థానాలు దక్కాయి.