Nepal Floods: నేపాల్‌లో వరదల బీభత్సం.. 112 మంది మృతి.. అప్రమత్తమైన బీహార్ ప్రభుత్వం

నేపాల్ లో గత కొన్నిరోజులుగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగిపోయాయి. దీంతో అక్కడి జనజీవనం స్తంభించింది.

Nepal Floods: నేపాల్‌లో వరదల బీభత్సం.. 112 మంది మృతి.. అప్రమత్తమైన బీహార్ ప్రభుత్వం

Nepal Floods

Updated On : September 29, 2024 / 12:57 PM IST

Nepal Floods and Landslides : నేపాల్ లో గత కొన్నిరోజులుగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగిపోయాయి. దీంతో అక్కడి జనజీవనం స్తంభించింది. వరద బాధితులను సహాయ దళాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆకస్మిక వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటం వల్ల ఇప్పటి వరకు 112 మంది మరణించినట్లు సాయుధ పోలీస్ దళం (ఏపీఎఫ్), నేపాల్ పోలీసులు తెలిపారు. మరో 68మంది అదృశ్యం కాగా.. 100 మంది వరకు గాయపడ్డారు. కవ్రెపాలన్ చౌక్ జిల్లాలో 34 మంది మరణించగా.. లలిత్ పూర్ లో 20 మంది, ధాండిగ్ లో 15 మంది మరణించారు. వీటితోపాటు.. ఖాట్మండు, సింధుపాల్ చౌక్, డోలాఖా, సున్సారి తదితర జిల్లాల్లోనూ వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

 

నేపాల్ లోని వరదల ప్రభావం భారత్ లోని బీహార్ రాష్ట్రంపై పడింది. అక్కడ నుంచి కొన్ని నదులు బీహార్ లోకి ప్రవహిస్తాయి. బీహార్ లోని కోసి, గండక్, గంగా నదులు పొంగిపొర్లుతుండటంతో రాష్ట్రంలోని 13జిల్లాలకు ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. నేపాల్ లో భారీ వర్షాల కారణంగా శనివారం రాత్రి గండక్ బ్యారేజీలో 5.40 లక్షల క్యూసెక్కుల నీటిని, కోసి బ్యారేజీకి 4.99లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో తూర్పు చంపారన్, గోపాల్ గంజ్, అరారియా, సుపాల్, కతిహార్, తదితర జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది.

కోసీ నదిలో వద్ద పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. పలు చోట్ల వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తోంది. నది ఒడ్డున నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 55 సంవత్సరాల తరువాత కోసి నదిలో భారీగా వరదనీరు చేరడం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు.