సింహంతో చెలగాటం : ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి

ఢిల్లీ జూలాజికల్ పార్క్‌లో హై డ్రామా నెలకొంది. జూలోని సింహం బోనులోకి వెళ్లిన వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడు. సరదాగా వెళ్లాడో, లేక తెలీక వెళ్లాడో కానీ బీహార్‌కి చెందిన రెహాన్ ఖాన్ అనే 28 సంవత్సరాల వ్యక్తి సెప్టెంబరు 17, గురువారం మధ్యాహ్నం సింహాలు ఉండే ఎన్‌క్లోజర్ గ్రిల్స్ ఎక్కి అందులోకి ప్రవేశించాడు. ఓచెట్టు సమీపంలో నిలబడి ఉండగా అతనికి ఎదురుగా సింహం వచ్చి నిలబడింది. దీంతో ఆవ్యక్తికి అసలు ప్రమాదం అర్ధమైంది.
ఇది గమనించిన బయట ఉన్న సందర్శకులు పెద్దగా కేకలు వేయడం ప్రారంభించారు. ఈలోపు సింహం కూడా అతని వైపే రావడం ప్రారంభించింది. వెంటనే రెహాన్‌ఖాన్ సమీపంలోని చెట్టు చుట్టూ తిరిగి వచ్చాడు. సింహం కూడా చెట్టు చుట్టూ తిరిగి వచ్చి అతని ముందు నిలబడింది. ఇదంతా జూ లోని ఇతర సందర్శకులు వీడియో తీశారు. సందర్శకులు తీసిన ఈ వీడియో వ్యవహారమంతా రెండున్నర నిమిషాలు నడిచింది.
ఇంతలో విషయం తెలసుకున్న జూ సిబ్బంది అతన్ని క్షేమంగా కాపాడి బయటకు తీసుకువచ్చారు. రెహాన్‌ఖాన్ ఇంతకీ లయన్ ఎన్‌క్లోజర్‌లోకి ఎందుకు వెళ్లాడనేది మాత్రం ఇంకా తెలీదు. సింహంతో చెలగాటం ఆడటం ఎంత ప్రమాదకరమో ఈవీడియో చూస్తే అర్ధమవుతుండగా, జూ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో వెంటనే అతడ్ని కాపాడగలిగారు. రెహాన్‌ఖాన్ మానసిక వికలాంగుడిగా కనిపిస్తున్నాడని డీసీపీ తెలిపారు.