బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్‌ షాకి కరోనా

  • Published By: naveen ,Published On : August 18, 2020 / 08:50 AM IST
బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్‌ షాకి కరోనా

Updated On : August 18, 2020 / 11:45 AM IST

దేశంలో చాలామంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫార్మా కంపెనీ బయోకాన్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా సైతం కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు స్వయంగా ఆమె సోమవారం(ఆగస్టు 17,2020) రాత్రి ట్వీట్ ద్వారా తెలిపారు. కరోనా కేసుల్లో తాను కూడా చేరానని, తనకు లక్షణాలు తక్కువగానే ఉన్నాయని… త్వరలోనే కరోనా తనను వదిలేస్తుందనే ఆశతో ఉన్నానని ఆమె ట్వీట్ లో చెప్పారు. 67ఏళ్ల మజుందార్ షా… దేశంలోని ప్రముఖ మహిళల్లో ఒకరు. బెంగళూరులో కేవలం రూ.10 వేలతో ఫార్మా కంపెనీ ప్రారంభించి దాన్ని వేల కోట్ల కంపెనీగా విస్తరించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు కిరణ్ మజుందార్ షా.



కాగా, రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ సమర్థతను ఇటీవలే ఆమె ప్రశ్నించారు. అసలు క్లినికల్ ట్రయల్స్ ఎలా జరిగాయో ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు. రష్యా దగ్గర అంత అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయని నిలదీశారు. రష్యాలోని గమలెయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెమియోలజీ అండ్ మైక్రోబయోలజీ… ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ తయారు చేసినట్లు ప్రకటించింది. అయితే 1, 2 దశల్లో జరిగిన ట్రయల్స్‌కి సంబంధించిన వివరాల్ని సరిగా బయటపెట్టలేదు. అందుకే ఈ వ్యాక్సిన్‌పై మజుందార్ షా లాంటి పరిశోధకులు, నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మూడో దశ ప్రయోగాలు చేయకుండా వ్యాక్సిన్ ఎలా రిలీజ్ చేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు.



కిరణ్ మజుందార్ షా కోవిడ్ బారిన పడినట్లు ట్వీట్ చేయగానే.. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్, కాంగ్రెస్ నేత శశిథరూర్ తదితర ప్రముఖులు స్పందించారు. కిరణ్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు.