Tamil Nadu Blast : తమిళనాడులో భారీ పేలుడు.. 18మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
విరుదునగర్ పేలుడు ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటనపై ఆయన కలెక్టర్ తో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Tamil Nadu Blast : తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది కార్మికులు మృతి చెందారు. మరో 9 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విరుదునగర్ జిల్లా కట్టనార్ పల్లిలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో కార్మికులు బాణసంచా తయారీలో నిమగ్నమై ఉండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు ధాటికి కిలోమీటర్ల మేర ప్రకంపనలు సంభవించాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. సంఘటనా స్థలంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో మహిళా కార్మికులు కూడా ఉన్నట్లు సమాచారం. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఫ్యాక్టరీ పరిసరాల్లో పార్క్ చేసిన వాహనాలు సైతం దగ్దమయ్యాయి.
విరుదునగర్ ఘోర ప్రమాదంపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేలుడు ఘటనపై ఆయన కలెక్టర్ తో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు. బాణసంచా పరిశ్రమకు కేంద్రమైన విరుదునగర్, శివకాశీ ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ఘోర ప్రమాదాలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించే ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: బాబ్ అల్ మాండెబ్ జలసంధి.. భారత్ కు ఎందుకంత కీలకం.. క్లోజ్ అయితే కలిగే నష్టం ఏంటి?
