పేలుడు శబ్దం 12 కిలోమీటర్ల వరకు: శక్తివంతమైన పదార్ధం 

  • Published By: chvmurthy ,Published On : February 15, 2019 / 03:38 AM IST
పేలుడు శబ్దం 12 కిలోమీటర్ల వరకు: శక్తివంతమైన పదార్ధం 

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాని అవంతిపొరా సమీపంలోని లెత్ పొరా వద్ద గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 43 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్ధం (ఐఈడీ) నింపుకున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్ధకు చెందిన ఆత్మాహుతి దళసభ్యుడు తన కారుతో, జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని బస్సును ఢీ కొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న ఒక బస్సు తునాతునకలు కాగా, కాన్వాయ్‌లోని పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

లెత్ పొరా మార్కెట్ కు సమీపంలో ఈఘటన జరగటంతో వ్యాపారస్తులు తమ షాపులు మూసివేసి ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఆత్మాహుతి సందర్భంగా ఏర్పడ్డ పేలుడు శబ్దం 10 నుంచి 12 కిలోమీటర్ల దూరం వినిపించినట్లు స్ధానికులు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు గాయపడ్డ సైనికులను శ్రీనగర్‌లోని 92 బేస్‌ బదామీగఢ్‌ ఆర్మీ కంటోన్మెంట్‌ ఆసుపత్రికి తరలించారు. ఈదాడిలో గాయపడ్డ జవాన్లలో చాలామంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు.

మళ్లీ విధుల్లో చేరేందుకు 2వేల 547 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు 78 వాహనాల్లో గురువారం తెల్లవారుజామున మూడున్నరకు జమ్మూ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరారు. వీరి వాహనాలు సాయంత్రంలోగా 266 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీనగర్‌కు చేరుకోవాల్సి ఉంది. కట్టుదిట్టమైన భద్రత ఉండే శ్రీనగర్‌–జమ్మూ జాతీయ రహదారిపై భద్రతా బలగాల వాహనాలు ఒకదానివెంట మరొకటి వెళుతుండగా, రెప్పపాటులో ఉగ్రవాది తన కారుతో బస్సును ఢీ కొట్టి ఈ దారుణానికి పాల్పడ్డాడు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు చెందిన ఫోరెన్సిక్‌ నిపుణులు, ఎన్‌ఎస్‌జీకి చెందిన పేలుడు పదార్థాల నిపుణులు ఘటనాస్థలికి చేరుకుని సాక్ష్యాలు, పేలుడు అవశేషాలను సేకరించారు.  

2001, అక్టోబర్‌ 1న జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీపై జైషేమహమ్మద్ ఉగ్రవాదులు చేసిన దాడిలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా గురువారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో 43 మంది జవాన్లను కోల్పోయామని జమ్మూ కాశ్మీర్ కు చెందిన పోలీసు అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.