#BoycottChina : చైనా వస్తువులు బహిష్కరిద్దాం.. స్వదేశీ వస్తువులను వాడదాం

లడఖ్‌లోని ఇండియా-చైనా వాస్తవాధీన రేఖ (LAC)వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య దేశంలో చైనా వస్తువులు, ఉత్పత్తులపై తీవ్ర నిరసన పెరుగుతోంది. సోమవారం రాత్రి గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘటనను నిరసిస్తూ 450రకాల చైనా వస్తువులను బహిష్కరిద్దామని CIAT (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండయన్ ట్రేడర్స్) ప్రజలకు పిలుపునిచ్చింది. చైనా వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను వాడాలని సీఏఐటీ కోరింది. ‘భారతీయ సామాన్.. హమారా అభిమాన్’ పేరుతో చైనాకు వ్యతిరేకంగా జాతీయస్థాయి ఉద్యమాన్ని ప్రారంభించింది.
సౌందర్య సాధనాలు, బ్యాగులు, బొమ్మలు, ఫర్నిచర్, పాదరక్షలు, గడియారాలు వంటి 450 దిగుమతి చేసుకున్న వస్తువులను జాబితా చేస్తూ, చైనా వస్తువులను బహిష్కరించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CIAT) పిలుపునిచ్చింది.ట్రేడర్స్ బాడీ 450 కి పైగా విస్తృత రకాల వస్తువుల జాబితాను విడుదల చేసింది. వీటిలో 3,000 చైనా ఉత్పత్తులు ఉన్నాయి.
ప్రస్తుతం, భారతదేశం చైనా నుండి ఏటా రూ .5.25 లక్షల కోట్లు, అంటే 70 బిలియన్ డాలర్లు విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. 2021 డిసెంబర్ నాటికి చైనా తుది వస్తువుల దిగుమతిని 13 బిలియన్ డాలర్లు లేదా లక్ష కోట్ల రూపాయలు తగ్గించడమే లక్ష్యమని సీఏఐటీ తెలిపింది.
లక్ష కోట్లకు పైగా విలువైన చైనా దిగుమతులకు అడ్డుకట్ట వేయడమే తమ ఉద్యమ లక్ష్యమని సీఏఐటీ జాతీయ ఉపాధ్యక్షుడు అమర్ పర్వానీ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్స్ మేఘలాల్ మాలూ, విక్రంసింగ్ డియో తెలిపారు. అలాగే, బహిష్కరించాల్సిన చైనా వస్తువులపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.
తాము మొదట విడుత 500 రకాల 3000కు పైగా చైనా వస్తువులను ఎంపిక చేశామని, ఈ తరహా వస్తువులు మనదేశంలోనూ తయారవుతున్నాయన్నారు. కానీ, మనవాటికంటే చైనా ప్రొడక్ట్స్ తక్కువ ధరలో లభిస్తున్నట్లు తెలిపారు. మనదేశంలో విదేశీ కంపెనీల వస్తువులు తయారవుతున్నాయని, తాము వాటి జోలికి వెళ్లట్లేదన్నారు. కేవలం చైనాలో తయారై మనం దిగుమతి చేసుకుంటున్న వస్తువులను మాత్రమే బహిష్కరించాల్సిన జాబితాలో చేర్చామని స్పష్టం చేశారు. అలాగే, చైనా తరహా వస్తువులను ఇక్కడే తయారు చేసుకునేలా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని తమ సంస్థ తరఫున కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు పర్వానీ తెలిపారు.
మరోవైపు సోషల్ మీడియా లో కూడా చైనా వస్తువుల బహిష్కరణపై పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడుస్తోంది. #BoycottChineseProducts #BoycottChinese, #BoycottChina, #ChinaGetOut కాంపెయిన్ ఇప్పుడు ట్రేండింగ్ లో ఉంది. #IndiaChinaFaceOff, #IndiaChinaBorder, #WorldWar3లు కూడా ట్రేండింగ్ టాపిక్స్ లో ఉన్నాయి.
కాగా, సోమవారం రాత్రి గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దాదాపు 40మంది చైనా సైనికులు కూడా ఈ ఘర్షణలో చనిపోయారని సమాచారం.
Read: జవాన్ల మధ్య చిచ్చు పెట్టిన టెంటు తొలగించారు.. అసలేం జరిగింది?