British F35 Fighter Jet: ఎట్టకేలకు.. 22 రోజుల తర్వాత.. కేరళ ఎయిర్ పోర్టు నుంచి యూకే ఫైటర్ జెట్ తరలింపు
బయలుదేరే ముందు తనిఖీల సమయంలో హైడ్రాలిక్ వైఫల్యాన్ని గుర్తించారు. ఇది జెట్ సురక్షితంగా టేకాఫ్, ల్యాండ్ అయ్యే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తారు.

British F35 Fighter Jet : హమ్మయ్య.. ఎట్టకేలకు ఆ యుద్ధ విమానం కదిలింది. ఎయిర్ పోర్ట్ నుంచి ఆ ఫైటర్ జెట్ ని తరలించారు. గత నెలలో అత్యవసరంగా ల్యాండింగ్ అయినప్పటి నుండి 22 రోజులుగా తిరువనంతపురం విమానాశ్రయంలో నిలిచిపోయిన బ్రిటిష్ F-35 ఫైటర్ జెట్‌ను ఆదివారం విమానాశ్రయం ఆవరణ నుండి తరలించారు.
ఫైటర్ జెట్ మరమ్మతు పనుల కోసం యూకే నుంచి 25 మంది ఏవియేషన్ ఇంజినీర్ల బృందం ప్రత్యేక పరికరాలతో బ్రిటీష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బస్ A400M విమానంలో ఆదివారం తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకుంది. మరమ్మతులు చేయడానికి ఫైటర్ జెట్ ని ఎయిర్ పోర్టులోని దాని స్థానం నుండి హ్యాంగర్‌కు తరలించారు.
HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగమైన బ్రిటిష్ F-35B యుద్ధ విమానం.. కేరళ తీరానికి 100 నాటికల్ మైళ్ల దూరంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ప్రతికూల వాతావరణం, తక్కువ ఇంధనం కారణంగా జూన్ 14న తిరువనంతపురం ఎయిర్ పోర్టుకు అత్యవసరంగా మళ్లించబడింది. భారత వైమానిక దళం విమానం సేఫ్ ల్యాండింగ్‌కు సాయం చేసింది. ఇంధనం నింపడంతో పాటు రవాణ సాయం అందించింది.
ఫైటర్ జెట్ తన క్యారియర్‌కు తిరిగి వెళ్లడానికి సిద్ధమైంది. బయలుదేరే ముందు తనిఖీల సమయంలో హైడ్రాలిక్ వైఫల్యాన్ని గుర్తించారు. ఇది జెట్ సురక్షితంగా టేకాఫ్, ల్యాండ్ అయ్యే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తారు. దీనికి మరమ్మతులు చేయడానికి ఏడబ్ల్యూ101 మెర్లిన్ హెలికాఫ్టర్‌లో నిపుణులు వచ్చారు. మరమ్మతులు నిర్వహించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. సమస్య పరిష్కారం కాలేదు. విమానం మొరాయించడంతో అప్పటి నుంచి ఈ ఫైటర్‌జెట్ ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయింది.
ఆ జెట్ విమానాన్ని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) రక్షణలో విమానాశ్రయంలోని బే 4 వద్ద నిలిపి ఉంచారు. ఫైటర్ జెట్ ని హ్యాంగర్‌లోకి తరలించడానికి ఎయిర్ ఇండియా ఇచ్చిన ప్రతిపాదనను బ్రిటిష్ రాయల్ నేవీ మొదట తిరస్కరించింది. తర్వాత బ్రిటిష్ నేవీ.. జెట్ విమానాన్ని హ్యాంగర్‌లోకి తరలించడానికి అంగీకరించింది.
బ్రిటీష్ ఫైటర్ జెట్ ఇక్కడే చిక్కుకుపోవడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతేకాదు ఫన్నీ వీడియోలతో మీమ్ ఐకాన్‌గా మారిందీ యుద్ధ విమానం. ఇక, కేరళ టూరిజం శాఖ మరో అడుగు ముందుకు వేసి.. ఈ యుద్ధ విమానాన్ని తమ టూరిజం ప్రమోషన్ కోసం వాడుకోవటం విశేషం.