ప్రజాస్వామ్య శిథిలాలపై కొత్త పార్లమెంట్ నిర్మాణం…కాంగ్రెస్

  • Published By: venkaiahnaidu ,Published On : December 10, 2020 / 09:38 PM IST
ప్రజాస్వామ్య శిథిలాలపై కొత్త పార్లమెంట్ నిర్మాణం…కాంగ్రెస్

Updated On : December 10, 2020 / 9:45 PM IST

Congress about the new Parliament building దేశ రాజధానిలో నూతన పార్లమెంట్ భవనానికి నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి గురువారం (డిసెంబర్-10,2020) ప్రధానమంత్రి మోడీ భూమి పూజ చేయడంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో స్పందించింది. సెంట్రల్ విస్తా పేరిట విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకునే పనిలో మోడీ ఉన్నారని కాంగ్రెస్ విమర్శించింది.



ప్రజాస్వామ్యాన్ని అణచివేసిన తర్వాత నిర్మించే భవనం..దేనికి సూచికగా నిలుస్తుందని ప్రశ్నించింది. దేశ రైతులు తమ హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో ఈ శంకుస్థాపన జరిగిందనే విషయాన్ని చరిత్ర గుర్తుంచుకుంటుందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్య శిథిలాలపై కొత్త పార్లమెంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని జరుగుతోందని కాంగ్రెస్ నేత చిదంబరం వ్యాఖ్యానించారు.

పాత, కొత్త పార్లమెంట్ భవనాలను వివిధ నిర్మాణాలతో పోల్చుతూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. బ్రిటీష్ వారు నిర్మించిన పార్లమెంట్.. మధ్యప్రదేశ్​లోని చౌసాత్ యోగినీ దేవాలయాన్ని పోలి ఉందని..తాజా నిర్మాణం వాషింగ్టన్​లోని పెంటగాన్​ను పోలి ఉందని అన్నారు. ఓ వైపు దేశం ఆర్థిక మందగమనంలో ఉంటే.. ప్రజలకు ఎలాంటి రాయితీలు ఇవ్వకుండా బీజేపీ ఆడంబరాలు చేస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి జైవీర్ షెర్గిల్ విమర్శించారు.



ప్రజాస్వామ్యంలో అధికారం ఉండటం అంటే తమ ఇష్టాలు, అభిరుచులను నెరవేర్చుకోవడం కాదని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ప్రజా సేవ, ప్రజలకు ప్రయోజనం కలిగించే పనులను చేయాలని సూచించారు. రైతులు 16 రోజులుగా ఆందోళనలు చేస్తుంటే.. సెంట్రల్ విస్తా పేరిట విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకునే పనిలో మోడీ ఉన్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు, శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్న సమయంలో పార్లమెంట్ సమీపంలో దళిత కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నూతన పార్లమెంట్​కు బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.



కాగా, నయా భారత్ కు కొత్త పార్లమెంట్ సింబల్ లా ఉంటుందని భూమి పూజ సందర్భంగా ప్రధాని మోడీ అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం ప్రస్థానంలో ఈరోజు ఎంతో ప్రత్యేకం అన్నారు. కొత్త పార్లమెంట్ భారతీయుల ఆకాంక్షలకు ప్రతీకంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న భవనంలో అనేక సమస్యలున్నాయని తెలిపారు.