ఆ రెండు సింహాల పేర్లు మార్చండి.. బెంగాల్ సర్కారుకు హైకోర్టు ఆదేశం

ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచిన రెండు సింహాలకు అక్చర్, సీత అని పేర్లు పెట్టడం వివాదానికి దారితీసింది. సింహాలకు పెట్టిన పేర్లను మార్చాలని హైకోర్టు ఆదేశించింది.

ఆ రెండు సింహాల పేర్లు మార్చండి.. బెంగాల్ సర్కారుకు హైకోర్టు ఆదేశం

Calcutta High Court Asks Bengal To Rename Lions

Calcutta High Court : పశ్చిమ బెంగాల్‌లో రెండు సింహాలకు పెట్టిన పేర్లు వివాదాస్పదమయ్యాయి. దీంతో వివాదం కలకత్తా హైకోర్టు వరకు వెళ్లింది. త్రిపుర నుంచి తీసుకొచ్చి సిలిగురిలోని బెంగాల్ సఫారీ పార్క్‌లో ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచిన రెండు సింహాలకు అక్చర్, సీత అని పేర్లు పెట్టారు. అయితే తాము పూజించే సీతాదేవి పేరును సింహానికి పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విశ్వహిందూ పరిషత్.. హైకోర్టును ఆశ్రయించింది. ఆడ సింహానికి పెట్టిన పేరును మార్చాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన జస్టిస్ సౌగత భట్టాచార్యతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.

వివాదాలకు దూరంగా ఉండాలని, రెండు సింహాలకు పెట్టిన పేర్లు మార్చే అంశాన్ని పరిశీలించాలని బెంగాల్ ప్రభుత్వానికి మౌఖిక ఆదేశాలు ఇచ్చిందని లైవ్ లా వెల్లడించింది. “హిందూ దేవత, ముస్లిం ప్రవక్త, క్రైస్తవ దేవుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, నోబెల్ బహుమతి గ్రహీత పేర్లను.. సింహాలకు ఎవరైనా పెడతారా? సాధారణంగా మన దేశ ప్రజలు గౌరవించే వారి పేర్లను జంతువులకు పెడతామా? మీరు పెంచుకునే జంతువులకు జాతీయ హీరోల పేర్లు పెట్టారా?” అని అడిషనల్ అడ్వకేట్ జనరల్‌ను జస్టిస్ భట్టాచార్య ప్రశ్నించారు.

Also Read: ఛత్రపతి శివాజీ వీర శునకం వాఘ్య కథ తెలుసా?

జంతువులకు దేవుడు, పౌరాణిక వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, నోబెల్ బహుమతి గ్రహీత పేర్లు పెట్టడం వెనుక ఉన్న కారణాన్ని కూడా హైకోర్టు ప్రశ్నించింది. ‘‘మీది సంక్షేమ రాజ్యం, సెక్యులర్‌ రాజ్యం.. సింహాలకు సీత, అక్బర్‌ పేర్లు పెట్టి ఎందుకు వివాదాలు కొనితెచ్చుకోవాలి? ఇలాంటి వివాదాలు నివారించాలి. ఆడ సింహానికే కాదు, మగ సింహానికి పెట్టిన పేరు కూడా సమర్థనీయం కాదు. అక్బర్ గొప్ప లౌకిక మొఘల్ చక్రవర్తి. సింహాలకు ఇంతకుముందే పేర్లు పెట్టివుంటే వాటిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంద”ని జస్టిస్ భట్టాచార్య వ్యాఖ్యానించారు.

Also Read: జయలలిత ఆభరణాలు తమిళనాడువే.. బెంగళూరు కోర్టు తాజా తీర్పు.. అసలేంటి కేసు?

త్రిపురలోనే ఈ రెండు సింహాలకు పేర్లు పెట్టారని, తమ ప్రభుత్వం వీటి పేర్లను మార్చే ఆలోచనలో ఉందని కోర్టుకు అదనపు అడ్వకేట్ జనరల్ తెలిపారు. కాగా, విశ్వహిందూ పరిషత్ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా మార్చాలని, దీన్ని సాధారణ బెంచ్ విచారిస్తుందని హైకోర్టు ఆదేశించింది.