వర్మకు షాక్ : పదవి నుంచి తొలగింపు

ఢిల్లీ: సీబీఐ చీఫ్ అలోక్ వర్మకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఆయనను పదవి నుంచి తప్పించింది. సీవీసీ నివేదికలో వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలను హైపవర్ కమిటీ నిజమేనని నిర్ధారించింది. ఆయనపై వేటు వేయడం కరెక్ట్ అని హైపవర్ కమిటీ అభిప్రాయపడింది. దీంతో, ఆ పదవి నుంచి అలోక్ వర్మను కేంద్రం తప్పించింది. సీబీఐ చీఫ్ పదవి నుంచి వర్మను బదిలీ చేయాలని హైపవర్ కమిటీ చెప్పింది. వర్మను అగ్నిమాపక శాఖ డీజీగా బదిలీ చేసింది. 24 గంటల్లో రెండుసార్లు సమావేశమైన హైపవర్ కమిటీ.. వర్మను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు గంటల పాటు సాగిన హైపవర్ కమిటీ సమావేశంలో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు.
అవినీతి ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం అలోక్ వర్మను సీబీఐ చీఫ్ పదవి నుంచి తప్పించి సెలవుపై పంపింది. తెలంగాణకు చెందిన మన్నె నాగేశ్వరరావుని తాత్కాలిక సీబీఐ చీఫ్‌గా నియమించింది. తన తొలగింపుని సవాల్ చేస్తూ అలోక్ వర్మ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. హైపవర్ కమిటీని సంప్రదించకుండా అలోక్ వర్మను సెలవుపై పంపలేరని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో 2019, జనవరి 9వ తేదీ బుధవారం సీబీఐ డైరక్టర్‌గా అలోక్ వర్మ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు తీసుకున్న 24గంటల్లోనే పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. 2019 జవనరి 31వ తేదీతో అలోక్ వర్మ పదవీ కాలం ముగియనుంది.