NMMS Scholarship 2026-27 : విద్యార్థులకు కేంద్రం బంపర్ ఆఫర్.. ఒక్కో విద్యార్థికి రూ.48వేలు.. కొద్దిరోజులే చాన్స్.. ఇలా దరఖాస్తు చేయండి! అర్హతులు ఇవే..
NMMS Scholarship 2026-27 : నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్షిప్ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్కాలర్షిప్ అందుతుంది.
Central Government National Means-cum-Merit Scholarship
NMMS Scholarship 2026-27 : విద్యార్థులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సారథ్యంలోని నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్షిప్ (NMMS/NMMSS) పథకం ద్వారా ఆర్థిక సాయం లభిస్తుంది.
Also Read : Vladimir Putin : భారత్ గడ్డపై అడుగుపెట్టిన వ్లాదిమిర్ పుతిన్.. ఘన స్వాగతం.. ప్రపంచం చూపు ఇండియా వైపు..!
ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏడాదికి రూ.12,000 చొప్పున స్కాలర్షిప్ అందుతుంది. అంటే నెలకు రూ.1,000 చొప్పున విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. అంటే మొత్తం నాలుగేళ్లలో రూ.48వేలు అందుతుంది. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా సుమారు లక్ష మంది విద్యార్థులను ఈ పథకానికి ఎంపిక చేస్తారు.
ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు
♦ NMMS స్కాలర్షిప్కు దరఖాస్తు చేయాలంటే విద్యార్థులు కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
♦ విద్యార్థి భారతీయ పౌరుడై ఉండాలి. 8వ తరగతిలో చదువుతున్న విద్యార్థి 7వ తరగతి పరీక్షలో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.
♦ SC/ST విద్యార్థులకు ఈ అర్హత మార్కుల్లో 5శాతం సడలింపు ఉంటుంది. అంటే కనీసం 50 శాతం మార్కులు సాధించాలి.
♦ విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం అన్ని వనరుల నుంచి కలిపి రూ.3.50 లక్షలకు మించకూడదు.
♦ కేంద్రీయ విద్యాలయాలు (KVS), జవహర్ నవోదయ విద్యాలయాలు (NVS), సైనిక్ స్కూళ్లు, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు అర్హులు కారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొన్ని బోర్డింగ్ లేదంటే రెసిడెన్షియల్ సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా అర్హత ఉండదు.
దరఖాస్తుకు తుది గడువు.. పరీక్ష తేదీ..
♦ 2026-27 విద్యా సంవత్సరానికి NMMS దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత దరఖాస్తు గడువును ఆగస్టు 31గా నిర్ణయించినప్పటికీ, తాజాగా కేంద్ర విద్యాశాఖ గడువును సెప్టెంబర్ 30, 2026 వరకు పొడిగించింది. NMMS పరీక్షను రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు తమ షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తాయి. ఎంపిక పరీక్షకు సంబంధించిన తేదీలు, హాల్టికెట్, ఫలితాలను ఆయా రాష్ట్రాల SCERT/విద్యాశాఖ వెబ్సైట్లలో విడుదల చేస్తారు.
ఎంపిక పరీక్ష విధానం..?
♦ NMMS ఎంపిక పరీక్షలో రెండు భాగాలు ఉంటాయి.
♦ Mental Ability Test (MAT) : విద్యార్థుల తార్కిక ఆలోచన, రీజనింగ్, సమస్య పరిష్కార సామర్థ్యాలను పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి.
♦ Scholastic Aptitude Test (SAT) : గణితం, సైన్స్, సోషల్ సైన్స్ తదితర అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
♦ MAT, SAT రెండింటిలోనూ 90 ప్రశ్నలు, 90 మార్కులు ఉంటాయి. ప్రతి పరీక్షకు 90 నిమిషాల సమయం కేటాయిస్తారు.
దరఖాస్తు ఎలా చేయాలి?
♦ NMMS స్కాలర్షిప్కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ National Scholarship Portal (NSP) ద్వారా జరుగుతుంది.
♦ తొలుత NSP అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
♦ ‘Apply for Scholarship’ ఆప్షన్ను ఎంచుకోవాలి.
♦ కొత్త విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
♦ మొబైల్ నంబర్ ద్వారా OTP ధ్రువీకరణ పూర్తి చేయాలి.
♦ అవసరమైన eKYC ప్రక్రియను పూర్తి చేయాలి.
♦ అనంతరం లాగిన్ చేసి NMMS స్కాలర్షిప్ దరఖాస్తును పూర్తి చేయాలి.
♦ వ్యక్తిగత, విద్యా, బ్యాంకు వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి.
♦ అవసరమైన పత్రాలను సమర్పించి దరఖాస్తును ఫైనల్గా సబ్మిట్ చేయాలి.
♦ భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ కాపీని భద్రపరుచుకోవాలి.
ఓటీపీ తప్పనిసరి..
ఎన్ఎస్పీలో దరఖాస్తు చేసే విద్యార్థులకు వన్ టైం రిజిస్ట్రేషన్ (OTR) ప్రక్రియ కూడా కీలకం. ఇప్పటికే ఓటీఆర్ నంబర్ వచ్చిన విద్యార్థులు దానితో నేరుగా స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటీఆర్ నంబర్ ఎస్ఎంఎస్ ద్వారా రాకపోతే ఎన్ఎస్పీలోని ‘Know your OTR’ ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఓటీఆర్ కోసం ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ, ఫేస్ ఆథరైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
