Central Government: కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ 2లక్షల కోట్ల స్కీం బంద్..?
కేంద్ర ప్రభుత్వం రూ. 2లక్షల కోట్ల స్కీమ్ ను నిలిపివేసేందుకు సిద్ధమైంది. చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశాన్ని గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా మారాలని ..

Production Linked Incentive Scheme
Central Government: కేంద్ర ప్రభుత్వం రూ. 2లక్షల కోట్ల స్కీమ్ ను నిలిపివేసేందుకు సిద్ధమైంది. చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశాన్ని గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా మారాలని చూస్తున్న ప్రభుత్వం.. ఇందుకోసం పొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీమ్ ను నాలుగేళ్ల కిందట తీసుకొచ్చింది. అయితే, ఇది ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవటంతో ప్రస్తుతం ఆ స్కీంను నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, దీనిస్థానంలో తయారీ రంగాన్ని మెరుగుపర్చేందుకు కొత్త పాలసీలను ప్రభుత్వం రెడీ చేస్తోందని సమాచారం.
గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా మారాలని చూస్తున్న ఇండియా.. ప్రతిష్టాత్మకమైన పీఎల్ఐ స్కీమ్ ను నాలుగేళ్ల కిందట తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద ప్రొడక్షన్ టార్గెట్లను చేరుకున్న కంపెనీలకు 23 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2లక్షల కోట్ల) విలువైన రాయితీలను ఇవ్వాలని ప్రభుత్వం చూసింది. కానీ, ఇప్పటి వరకు సుమారు రూ.15వేల కోట్ల (1.7బిలియన్ డాలర్ల) రాయితీలనే ఇచ్చింది. ఈ పథకం కింద అర్హత పొందిన చాలా కంపెనీలు ఇప్పటికీ ప్రొడక్షన్ పెట్టకపోవటంతోపాటు.. పెట్టుకున్న ప్రొడక్షన్ టార్గెట్ లో ఇప్పటి వరకు 37శాతాన్నే చేరుకోవటంతో పీఎల్ఐ స్కీమ్ ను కేంద్రం కొనసాగించాలని అనుకోవటం లేదని రాయిటర్స్ రిపోర్టు చేసింది. స్కీమ్ ను ప్రభుత్వం కొనసాగించే ఆలోచనలో లేదని గవర్నమెంట్ డాక్యుమెంట్ ను కోట్ చేస్తూ రాయిటర్స్ రిపోర్టు చేసింది.
పీఎల్ఐ స్కీమ్ కింద ఇప్పటి వరకు 755 కంపెనీలు అర్హత పొందాయి. ఇందులో యాపిల్ ఫోన్లను తయారు చేసే ఫాక్స్ కాన్, ఇండియాలో అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటివి ఉన్నాయి. ప్రస్తుతం 14 సెక్టార్లలో పీఎల్ఐ అమలవుతుండగా, మెబైల్ ఫోన్లు, ఫార్మా సెక్టార్లలో ఈ స్కీమ్ భారీ విజయం సాధించింది. ఈ రెండు సెక్టార్లలోని కంపెనీలకే 94శాతం రాయితీలు వెళ్లాయి. కొన్ని కంపెనీలు ప్రొడక్షన్ టార్గెట్ ను చేరుకున్నప్పటికీ.. కనీస పెట్టుబడి లెవెల్ ను చేరుకోకపోవడం, కనీస వృద్ధిని నమోదుచేయలేక పోవటం వంటి కారణాలతో వీటికి రాయితీలను ఇవ్వలేదు. అయితే, దీనిపై కంపెనీలు ఫిర్యాదు చేయడంతో కొన్ని డెడ్ లైన్లను పొడిగించడానికి, రాయితీలను తరచూ ఇవ్వడానికి కేంద్రం ముందుకొచ్చింది.
పీఎల్ఐ సాయంతో 2025 నాటికి జీడీపీలో మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ వాటాను 25శాతానికి పెంచుకోవాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకుంది. కానీ, ఈ నెంబర్ గత నాలుగేళ్లలో 15.4శాతం నుంచి 14.3శాతానికి తగ్గింది. చాలా కంపెనీలు ప్రొడక్షన్ మొదలు పెట్టడంలో విఫలమయ్యాయి. రాయితీలు చాలా ఆలస్యంగా అందుతున్నాయని ప్రొడక్షన్ టార్గెట్ చేరుకున్న కంపెనీలు ఫిర్యాదు చేస్తున్నాయి. దీనికితోడు అధికారుల అలసత్వం వంటి వివిధ సమస్యలతో పీఎల్ఐ అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయిందని ఎనలిస్టులు చెబుతున్నారు.