ఈ ప్రాంతాల్లోనే లాక్ డౌన్ ఉల్లంఘనలు ఎక్కువ.. జాబితా విడుదల

ఒకవైపు కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుంటే.. మరోవైపు లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘించేవారి సంఖ్య అలానే పెరిగిపోతోంది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నగరాల జాబితాను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ముంబైతోపాటు పుణె, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, రాజస్థాన్‌లోని జైపూర్, పశ్చిమబెంగాల్‌లోని పలు ప్రాంతాలు ఇందులో ఉన్నాయి.
లాక్‌డౌన్ ఉల్లంఘనలపై వచ్చిన సమాచారాన్ని విశ్లేషించిన అనంతరమే ఈ జాబితా రూపొందించినట్టు కేంద్రం వెల్లడించింది. పశ్చిమబెంగాల్‌లోనే ఎక్కువ లాక్ డౌన్ ఉల్లంఘన ప్రాంతాలున్నాయి. కోల్‌కతాతోపాటు హౌరా, ఈస్ట్ మిడ్నాపూర్, ఉత్తర 24 పరగణాలు, డార్జిలింగ్, కాలింపోంగ్, జల్‌పాయ్‌గురి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘనలు ఎక్కువగా ఉన్నాయని, వైద్యసిబ్బంది, పోలీసులపై కూడా దాడులు జరుగుతున్నాయని కేంద్రం తెలిపింది.
హట్‌స్పాట్ జిల్లాల్లో నిబంధనల అమలు పర్యవేక్షణకు తక్షణమే 6 నిపుణుల బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. 3 రోజుల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చి బెంగాల్‌లో పర్యటిస్తారు. తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పరిశీలిస్తారని, ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తూ కేంద్రానికి నివేదిక అందిస్తారని తెలిపింది. కేంద్ర జాబితాపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఈ జాబితాను ఎలా రూపొందించిందో చెప్పాలన్నారు. కరోనా పాజిటివ్ కేసుల్లో 80 శాతం మందికి లక్షణాలు కనిపించడం లేదని నిపుణులు అంటున్నారు. కరోనా బాధితులను గుర్తించడం అధికార యంత్రాంగానికి పెద్ద సవాలుగా మారిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సీనియర్ సైంటిస్ట్ రామన్ ఆర్ గంగఖేద్కర్ తెలిపారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో 50 శాతం కేవలం 6 నగరాల్లోనే ఉన్నట్టు గుర్తించారు. ఈ జాబితాలో హైదరాబాద్‌తోపాటు ముంబై, ఇండోర్, మధ్యప్రదేశ్, కొర్బా, రాంచి, ఖుర్దా నగరాలు ఉన్నాయి. మొత్తం కేసుల్లో 46 శాతం 18 జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. దేశంలోని 736 జిల్లాలకు 325 జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు. 44 శాతం ప్రాంతం కరోనా కేసులు నమోదు కాలేదు. తెలంగాణలోని వరంగల్ రూరల్, యాదాద్రి-భువనగిరి, వనపర్తి, సిద్దిపేట జిల్లాల్లోనూ ఒక్క కరోనా కేసులు నమోదు కాలేదు.